icon icon icon
icon icon icon

చనిపోయిన పింఛనుదార్లకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి

సామాజిక భద్రత పింఛన్లను ఇళ్ల వద్దే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి, వయోవృద్ధులను తీవ్ర ఎండల్లో ఇబ్బందులకు గురిచేసి.. వారి మరణాలకు కారణమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా మాజీ ఎంపీ, పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్‌ మానవ హక్కుల సంఘాన్ని కోరారు.

Published : 08 May 2024 06:18 IST

మానవ హక్కుల సంఘానికి తెదేపా నేత కనకమేడల లేఖ

ఈనాడు, దిల్లీ: సామాజిక భద్రత పింఛన్లను ఇళ్ల వద్దే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులను బుట్టదాఖలు చేసి, వయోవృద్ధులను తీవ్ర ఎండల్లో ఇబ్బందులకు గురిచేసి.. వారి మరణాలకు కారణమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా మాజీ ఎంపీ, పార్టీ జాతీయ ఎన్నికల సమన్వయకర్త కనకమేడల రవీంద్రకుమార్‌ మానవ హక్కుల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ అరుణ్‌మిశ్రాకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిల నిర్లక్ష్యం కారణంగా33 మంది పింఛనుదారులు చనిపోయారని, అందువల్ల బాధ్యులైన ఈ ముగ్గురు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్‌, మే నెలల పింఛన్లు అందుకొనే క్రమంలో కన్నుమూసిన పింఛనుదారుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఏపీప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

2019లో డీజీపీ, సీఎస్‌లను మార్చలేదా?

రాష్ట్రంలో అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారు.. ఎన్నికలు సజావుగా జరుగుతాయని అనిపించడం లేదంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలను కనకమేడల రవీంద్రకుమార్‌ ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు డీజీపీ, సీఎస్‌లను మార్చలేదా అని ప్రశ్నించారు. డీజీపీని మార్చగానే ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకు డీజీపీని అడ్డుపెట్టుకొని మీరు సాగించిన ఆటలు ఇకపై సాగవన్న భయం పట్టుకుందా అని నిలదీశారు. బటన్‌ నొక్కిన డబ్బులకు చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారని జగన్‌ ఆరోపించడం ఆయన దిగజారుడుతనానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. గత ఖరీఫ్‌కు సంబంధించి పంట నష్టపరిహారం రూ.847 కోట్లు రైతులకు ఇస్తున్నట్లు మార్చి 6న, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.610 కోట్లు ఇస్తున్నట్లు మార్చి 1న బటన్లు నొక్కినా.. ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. ఖజానాలో డబ్బుల్లేక చేతులైనా ఎత్తేసి ఉండాలని, లేకపోతే చివరి నిమిషం వరకు ఆపేసి.. పోలింగ్‌కు ముందురోజు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులేసి ఓట్లను కొనుగోలు చేయాలన్న దుష్ట ఎత్తుగడైనా వేసి ఉండాలని అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img