icon icon icon
icon icon icon

మాకేం చేశారని ఓట్లు అడగటానికి వచ్చారు?

‘మాకేం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు.. ఇంటి పట్టాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గడపగడపకు మన ప్రభుత్వం సంక్షేమ పుస్తకాల్లో ముద్రించారు.

Published : 08 May 2024 06:50 IST

ఎన్నికల ప్రచారంలో అంబటి రాంబాబును నిలదీసిన ఎస్సీలు
సమస్యలు అడిగిన మాజీ సర్పంచిని నెట్టేసిన మంత్రి

ముప్పాళ్ల, న్యూస్‌టుడే: ‘మాకేం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు.. ఇంటి పట్టాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు గడపగడపకు మన ప్రభుత్వం సంక్షేమ పుస్తకాల్లో ముద్రించారు. కాలనీలో రోడ్లు, డ్రెయిన్ల ఏర్పాటు, అభివృద్ధిని పట్టించుకోలే’దంటూ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం ఎస్సీ కాలనీలో మంత్రి, వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబును స్థానికులు నిలదీశారు. మంగళవారం ఆ గ్రామంలో ఎన్నికల ప్రచారానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా సమస్యల్ని స్థానికులు చెబుతుండగా ఆయన సమాధానం చెప్పకుండా మరో వీధికి వెళ్లారు. తాను మాజీ సర్పంచి, తన కుమార్తె మాజీ ఎంపీటీసీ సభ్యురాలని, మిమ్మల్ని కలవడానికి రెండుసార్లు వస్తే పట్టించుకోలేదని చింతపల్లి ఆశీర్వాదం పేర్కొన్నారు. తన మనవరాళ్లకు గురుకులంలో సీటు ఇప్పించమని వేడుకున్నా కనీసం స్పందించలేదని.. పట్టించుకోని మీకెందుకు మద్దతివ్వాలని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు. అడిగిన వాటన్నింటికీ సమాధానం చెప్పాలా? అంటూ ఆశీర్వాదంను నెట్టుకుంటూ మంత్రి ముందుకెళ్లారు. సమస్యలపై స్పందించకుండా మంత్రి పలాయనం చిత్తగించడంపై స్థానికులు మండిపడ్డారు. మాజీ సర్పంచిని నెట్టేయడమేంటని ఆందోళనకు సిద్ధమయ్యారు. మళ్లీ తమ కాలనీ వైపువస్తే అడ్డుకోవాలని సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ మారూరి పద్మ భర్త రామలింగారెడ్డి ఆశీర్వాదంను కలసి మంత్రి తరఫున క్షమాపణ చెప్పారు. రాంబాబు తీరు సరిగ్గా లేదని, మళ్లీ గెలిపిస్తే మమ్మల్ని పట్టించుకుంటారా? అని ఎస్సీ కాలనీవాసులు గ్రామ వైకాపా నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img