icon icon icon
icon icon icon

రాష్ట్రంలో నేర రాజకీయాలు నడుస్తున్నాయ్‌

రాష్ట్రంలో డీజీపీ, విజయవాడ సీపీ, పోలీసులంతా సిండికేట్‌గా మారి ప్రతిపక్షాల అభ్యర్థులను వేధించేందుకు కుట్ర పన్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 21 Apr 2024 05:52 IST

గులకరాయి కేసులో ఇరికిస్తే ఈజీగా వదిలిపెట్టం
బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: రాష్ట్రంలో డీజీపీ, విజయవాడ సీపీ, పోలీసులంతా సిండికేట్‌గా మారి ప్రతిపక్షాల అభ్యర్థులను వేధించేందుకు కుట్ర పన్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తనపై అక్రమ కేసు బనాయించేందుకు వడ్డెరకాలనీ వాసులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో నేర రాజకీయాలు నడుస్తున్నాయని, గులకరాయి కేసులో తనను ఏ2గా కూడా పెట్టవచ్చన్నారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడారు. ‘జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లపాటు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేసింది. ఎన్నికల కోడ్‌ వచ్చాక కూడా అదే పంథా కొనసాగిస్తోంది. సీఎం జగన్‌ నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 100 మంది పోలీసులు నా కార్యాలయాన్ని చుట్టుముట్టారు. మేం చేసిన తప్పేంటి? సీఎంపై గులకరాయి దాడి అంటూ సతీష్‌పై తప్పుడు కేసులు పెట్టారు. న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్‌మెంట్‌ ఇవ్వకపోతే సతీష్‌ను కూడా కోడి కత్తి శ్రీనులా చేస్తామంటూ అతని తల్లిదండ్రులను పోలీసు ఉన్నతాధికారులు బెదిరించార’ని ఉమా ఆరోపించారు. అన్న క్యాంటీన్‌ మూసివేశారని, అతనితో పాటు అతని తల్లికి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడం వల్లే కడుపుమంటతో గులకరాయి వేశానని సతీష్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఘటనపై సీబీఐ విచారణ జరపాలని తాము మొదటి రోజే అడిగామని, జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సీబీఐ విచారణ కోరాలని ఉమా డిమాండ్‌ చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న వైనంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తే ఈజీగా వదిలిపెట్టబోమని, తెదేపా అధికారంలోకి రాగానే గులకరాయి కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన వారిని జైలుకు పంపిస్తామని బొండా ఉమా హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img