icon icon icon
icon icon icon

మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు

ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.

Published : 21 Apr 2024 06:14 IST

2029 ఎన్నికల్లో సాధ్యమవుతాయి
తెదేపాతో కూడిన ఎన్డీయే ప్రభుత్వంలో జరుగుతుంది
గూడూరులో మహిళలతో సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, తిరుపతి: ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకుండా చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు ఆడబిడ్డలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. 2029లో ఇది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెదేపా భాగస్వామిగా ఎన్డీయే ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లా గూడూరులో శనివారం మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘30 ఏళ్ల కిందట ఆడబిడ్డలు బయటకు వచ్చేవారుకాదు. ఆడబిడ్డలు ఉన్నతవిద్య చదవాలని ఎన్టీఆర్‌ శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెచ్చి ఆడపిల్లలకు అధికారం ఇచ్చింది తెదేపానే. ఉద్యోగాలు, కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాం. మహిళలు కట్నం ఇచ్చే పరిస్థితి నుంచి ఎదురుకట్నం పుచ్చుకునే పరిస్థితి తెదేపా తెచ్చింది. డ్వాక్రాసంఘాలు తెచ్చి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం. వడ్డీలేని రుణాలిచ్చాం’ అని చంద్రబాబు చెప్పారు.

చంద్రన్న మా డ్రైవర్‌ అని చెప్పండి

‘ఆడబిడ్డల కోసం మహాశక్తి పేరుతో పథకాలు తీసుకురానున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. దర్జాగా బస్సు ఎక్కి మా డ్రైవర్‌ చంద్రన్న, ఆయన అనుమతి ఇచ్చాడని చెప్పండి. పేదలకు పింఛను ఇచ్చింది, పెంచింది తెదేపానే. రానున్న రోజుల్లో ఇంటి దగ్గరనే మొదటి తారీఖున ఇస్తాం. ఇంటి దగ్గరే పింఛను ఇచ్చే అవకాశం ఉన్నా ఎండలో నిల్చోబెట్టి కొందరిని చంపేసి, శవరాజకీయాలు చేశారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే నా జీవితాశయం. దాన్ని చేసి చూపిస్తానని నా పుట్టినరోజున పేదలకు హామీ ఇస్తున్నా. నాకు ముఖ్యమంత్రి పదవి ఒక బాధ్యత. జగన్‌కు దోపిడీ చేసేందుకు ఒక లైసెన్సు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయిదేళ్లలో అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా గంజాయి విక్రయిస్తున్నారు. ఒక్కసారి పొరపాటున పిల్లలు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే వాళ్లు మన చేతుల్లో ఉండరు. జగన్‌ దీన్ని నియంత్రించడం కాదు కదా.. కనీసం సమీక్షించలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తీసుకొచ్చారు. నిర్భయ చట్టం కింద చర్యలు తీసుకోని దుర్మార్గుడు జగన్‌మోహన్‌రెడ్డి’ అని చెప్పారు. ‘నాడు విద్యుత్తు ఛార్జీ ఎంత? ఇప్పుడు ఎంత? నెలకు అదనంగా ఎంత చెల్లిస్తున్నాం? నాడు మద్యం ధర రూ.60 ఉంటే ఇప్పుడు రూ.200. నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ, పెట్రోల్‌ ధరల పేరుతో జగన్‌ ఎంత డబ్బు కొట్టేస్తున్నారో లెక్క వేయాలి. ఆసరా, పింఛను, ఆటో కార్మికులకు ఎంతిచ్చి, ఎంత లాక్కున్నారో లెక్కలు తేల్చాలి’ అని మహిళలకు సూచించారు.

ఇళ్లు కట్టిస్తాం

‘అందరికీ ఇళ్లు కట్టిస్తా. టిడ్కో ఇళ్లు ఉచితంగా అందిస్తాం. జగన్‌ ఒక్క సెంటు ఇచ్చి అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు తయారు చేశారు. ఇచ్చిన పట్టాలు రద్దు చేయం. కొత్తగా రెండు సెంట్ల స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తాం’ అని చంద్రబాబు చెప్పారు. ‘బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ చెబుతున్నారు. ఎన్నికల్లో జగన్‌ చేసిన దుర్మార్గాలకు సమాధానంగా కూటమి అభ్యర్థుల గుర్తుపై బటన్‌ నొక్కాలి’ అని పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని వేదికపై ఆయనతో తెదేపా నాయకులు కేకు కోయించారు. మహిళలు, యువత ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘చంద్రబాబు సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు మహిళలు వైకాపా ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img