icon icon icon
icon icon icon

వైకాపా పతనం ఖాయం

 వైకాపా పాలనకు ముగింపు పలకాలన్నదే లక్ష్యం కావాలని, ఐక్యంగా పోరాడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

Published : 21 Apr 2024 06:20 IST

చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పవన్‌కల్యాణ్‌

  • ‘వచ్చే ఎన్నికల్లో తెదేపా- జనసేన- భాజపాలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లుగా.. ప్రతిచోటా జనసేన పోటీ చేస్తున్నట్లుగా జనసైనికులు, వీర మహిళలు భావించాలి. తెదేపా, భాజపా కార్యకర్తలు కూడా అలాగే అనుకోవాలి. మూడు పార్టీల కార్యకర్తలూ ఐకమత్యంగా పోరాడితే విజయం అద్భుతంగా ఉంటుంది.’
  •  ‘చంద్రబాబును వైకాపా ఉద్దేశపూర్వకంగా వేధించి జైల్లో పెట్టింది. తెదేపా క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే కీలక సమయంలో రిస్కు తీసుకుని ఆ పార్టీకి అండగా, చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలిచాం. వైకాపా పాలన అంతం కావాలన్నదే దాని ఉద్దేశం. జనసేన, తెదేపా కార్యకర్తలు సూక్ష్మంగా ఆలోచించి, సమష్టిగా ముందుకెళ్తే ముచ్చటేసింది. ఇదే స్ఫూర్తిని పోలింగ్‌బూత్‌ వరకు తీసుకెళ్లి కూటమి విజయానికి బలమైన పునాది వేయాలి’

 పిఠాపురం నియోజకవర్గ తెదేపా కార్యకర్తల  సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌


ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కొత్తపల్లి:  వైకాపా పాలనకు ముగింపు పలకాలన్నదే లక్ష్యం కావాలని, ఐక్యంగా పోరాడాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలతో యు.కొత్తపల్లిలో శనివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పిఠాపురం తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును పవన్‌కల్యాణ్‌ కోశారు. వైకాపా పాలన ముగిసి, సుస్థిరమైన పాలన అందించాలనే ఆకాంక్షతోనే క్లిష్ట సమయంలో తెదేపాకు జనసేన అండగా నిలిచిందని స్పష్టం చేశారు. అటు.. ఇటు అయినా జనసేన ఉనికికే ప్రమాదం అని తెలిసినా..ఆరోజు రాజమహేంద్రవరం జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించానని, వెంటనే పొత్తు నిర్ణయం తెలిపానని గుర్తుచేశారు. భాజపా సైతం కూటమిలోకి రావడంతో వైకాపా పతనం ఖాయమైందన్నారు.

కూటమి విజయం ముఖ్యం..: పిఠాపురంలో కేవలం పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్నట్లు భావించాల్సిన అవసరం లేదని.. ఇక్కడ వ్యక్తి విజయం కంటే కూటమి విజయం ముఖ్యమని జనసేనాని స్పష్టం చేశారు. తాను గెలిస్తే వర్మ గెలిచినట్లేనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పొత్తులో భాగంగా రాష్ట్రంలో 144 స్థానాల్లో పవన్‌ కల్యాణ్‌ తెదేపాకు అండగా ఉంటే.. 21 స్థానాల్లో చంద్రబాబు జనసేనకు అండగా ఉన్నారని అన్నారు. పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సమావేశంలో ఉదయ్‌ శ్రీనివాస్‌, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, నాయకులు జ్యోతుల శ్రీనివాస్‌, మర్రెడ్డి శ్రీనివాస్‌, గిరీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img