icon icon icon
icon icon icon

ఉండి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేయనున్నారు.

Published : 22 Apr 2024 05:14 IST

మాడుగుల నుంచి బండారు.. మడకశిర బరిలో ఎంఎస్‌ రాజు
పాడేరు అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి.. వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణకే
తెదేపా అభ్యర్థుల జాబితాలో మార్పులు

ఈనాడు, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేయనున్నారు. దీనితోపాటు మరో నాలుగు స్థానాల్లోనూ తెదేపా అభ్యర్థులను మార్చింది. వీరందరికీ ఆదివారం బీఫాంలు అందించింది. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి తొలుత సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. అయితే తాజా సమీకరణాల నేపథ్యంలో ఆయనను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమన్వయకర్తగా, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడిగా నియమించారు. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్‌ ఖరారు చేశారు. సోమవారం నామినేషన్‌ వేయనున్నట్లు రఘురామ ప్రకటించారు.

  • అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి తొలుత పైలా ప్రసాద్‌ పేరును అధిష్ఠానం ప్రకటించింది. పొత్తులో భాగంగా పెందుర్తి స్థానాన్ని జనసేనకు ఇవ్వడంతో.. అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్న బండారు సత్యనారాయణమూర్తికి టికెట్‌ దక్కలేదు. దీంతో ఆయనను మాడుగుల స్థానం నుంచి పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా వెంకటరమేశ్‌ నాయుడి పేరును పార్టీ గతంలో ఖరారు చేసింది. సమీకరణాల నేపథ్యంలో అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పోటీ చేయించాలని తెదేపా నిర్ణయించింది.
  • శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర అసెంబ్లీకి తొలుత తెదేపా తరఫున సునీల్‌కుమార్‌ పేరు ప్రకటించారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎంఎస్‌ రాజును బరిలో నిలుపుతున్నట్లు తెదేపా ప్రకటించింది.
  • మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియను వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో ప్రకటించారు. తాజాగా ఆమెను మార్చి.. తండ్రి రామకృష్ణకే అవకాశం కల్పించారు.

పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా తోట సీతారామలక్ష్మి

తెదేపా నాయకురాలు తోట సీతారామలక్ష్మిని పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు వివరించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొమ్మి లక్ష్మయ్యనాయుడిని నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img