icon icon icon
icon icon icon

జగన్‌కు ఓటేస్తే ఏమి ఉద్ధరించారు

‘వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా జగన్‌ అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు ఓటేశారు. అయిదేళ్లు అధికారంలో ఉండి జగనన్న ఏమి ఉద్ధరించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇవ్వకుండా ఇంతకాలం గాడిదలు కాశారా?

Published : 23 Apr 2024 06:47 IST

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఏమి చేశారు?
సాగు, తాగునీళ్లు లేక జనం వలస బాట పట్టారు
ప్రకాశం జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజం

ఈనాడు, ఒంగోలు, యర్రగొండపాలెం: ‘వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా జగన్‌ అభివృద్ధి చేస్తారని గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు ఓటేశారు. అయిదేళ్లు అధికారంలో ఉండి జగనన్న ఏమి ఉద్ధరించారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇవ్వకుండా ఇంతకాలం గాడిదలు కాశారా? సాగు, తాగు నీటి వసతి లేక పశ్చిమ ప్రకాశం ప్రజలు పొట్ట చేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేనివాళ్లు.. ఇచ్చిన హామీలు నెరవేర్చనివాళ్లు వైఎస్‌ఆర్‌ వారసులా? ఎమ్మెల్యేలుగా గెలిచి కమీషన్లతో దోచుకున్నారని, వారిని వేరే నియోజకవర్గాలకు విసిరేసే చెత్త పార్టీ వైకాపాకు ఓటేయడం అవసరమా..అని ప్రజలు ఆలోచించాలి’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. న్యాయ యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం, సంతనూతలపాడుల్లో పర్యటించిన ఆమె మాట్లాడుతూ అయిదేళ్ల వైకాపా పాలనను కడిగిపారేశారు. వైఎస్‌ఆర్‌ రైతును రాజులా చూసుకుంటే జగన్‌ రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. మూడు జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు ఇచ్చే వెలిగొండ ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ 60 శాతం పూర్తిచేశారని.. 6నెలల్లో పూర్తి చేస్తామన్న జగనన్న అయిదేళ్లు అయినా పూర్తిచేయలేదని దుయ్యబట్టారు.


వీళ్ల వల్ల నాకు ప్రాణహాని లేదు, వదలండి

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకి ప్రజల పట్ల నాకు ప్రాణహాని లేదు. వాళ్లను స్వేచ్ఛగా వదలండి అంటూ వైఎస్‌ షర్మిల అన్నారు. అద్దంకి పాత బస్టాండ్‌ వద్ద రోడ్‌షో ప్రారంభంలో చేరిన ప్రజలకు అడ్డుగా తాడు, బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఆమె మాట్లాడారు. అనంతరం తాడు, బారికేడ్లను పోలీసులు తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img