icon icon icon
icon icon icon

మీ డ్రీమ్స్‌.. నా స్కీమ్స్‌

‘మీ డ్రీమ్స్‌.. నా స్కీమ్స్‌గా’ 40 పథకాలు పెట్టానని సీఎం జగన్‌ అన్నారు. 58 నెలల్లో 130సార్లు బటన్‌ నొక్కి రూ.2.75 లక్షల కోట్లను లబ్ధిదారులకు జమచేసినట్లు తెలిపారు.

Published : 24 Apr 2024 05:52 IST

చెల్లూరు సిద్ధం సభలో జగన్‌
సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే జారుకున్న జనం

ఈనాడు, విజయనగరం: ‘మీ డ్రీమ్స్‌.. నా స్కీమ్స్‌గా’ 40 పథకాలు పెట్టానని సీఎం జగన్‌ అన్నారు. 58 నెలల్లో 130సార్లు బటన్‌ నొక్కి రూ.2.75 లక్షల కోట్లను లబ్ధిదారులకు జమచేసినట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు కూడలిలో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకే కావని, పిల్లల భవిష్యత్తు కోసమేనని చెప్పారు. ప్రజల కలలను మోసాలతో వంచించడమే పనిగా చంద్రబాబు కూటమి పెట్టుకుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మలేమన్నారు. ఇదే కూటమి 2014లో ముఖ్యమైన హామీలంటూ మోసం చేసిందని విమర్శించారు. అనంతరం వైకాపా అభ్యర్థులను పరిచయం చేశారు. ఆయన వెంట మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు.

జారుకున్న జనం

సభకు జగన్‌ గంట ఆలస్యంగా చేరుకున్నారు. అయినా సభాప్రాంగణం ఖాళీగానే కనిపించింది. సీఎం ప్రసంగం మొదలైన 5 నిమిషాలకే చాలామంది వెనుదిరిగారు. వైకాపా నాయకులు మహిళలకు రూ.200-250, పురుషులకు మద్యం, బిర్యానీ అందించారు. బైకు ర్యాలీల్లో పాల్గొన్న యువత పేర్లు నమోదు చేసుకుని డబ్బులిచ్చారు. ముందుగా సభాస్థలికి చేరుకున్న మహిళలు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు జాతీయ రహదారులకు ఆనుకుని వేదిక ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. ఓ అంబులెన్స్‌ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది.

కంటతడి పెట్టిన బొత్స

‘నాకు తండ్రి లాంటి వాడు.. అన్నా అని పిలుస్తాను. మంచివాడు, సౌమ్యుడు.. మీకు తెలిసినవాడు’ అంటూ చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణను జగన్‌ పరిచయం చేశారు. ఈ సమయంలో బొత్స ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. జగన్‌ కాళ్లకు మొక్కే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపించింది.

కలలు కల్లలు చేసిందెవరు?

చంద్రబాబు మాట నమ్మి ఆర్థికంగా కుదేలైన పొదుపు సంఘాలను ఆదుకునేందుకు పుట్టిందే వైఎస్సార్‌ ఆసరా అని జగన్‌ అన్నారు. అసలు పొదుపు సంఘాలను ప్రోత్సహించిందే చంద్రబాబు అయితే, ఆయనేం చేశారంటూ జగన్‌ ప్రశ్నించడంపై కొందరు మహిళలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ప్రజల కలల కోసం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు అందుబాటులోకి తెస్తున్నట్లు జగన్‌ ఊదరగొట్టారు. ‘విజయనగరంలో కనిపిస్తుంది కదా?’ అంటూ ప్రజలను ప్రశ్నించారు. ‘భోగాపురంలో విమానాశ్రయం పనులను వాయువేగంతో చేస్తున్నాం’ అన్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img