icon icon icon
icon icon icon

సంక్షిప్తవార్తలు(4)

ఒకటో తేదీన ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేయించాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు. ‘ఇంటిదగ్గరే పింఛను ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదు.

Updated : 24 Apr 2024 07:15 IST

ఆ ముగ్గురు అధికారులను ఈసీ తొలగించాలి
ఇంటిదగ్గరే పింఛన్లు ఇవ్వాలి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఈనాడు, అమరావతి: ఒకటో తేదీన ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేయించాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు. ‘ఇంటిదగ్గరే పింఛను ఇవ్వొద్దని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదు. 2లక్షల మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నా.. వారి సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు ఫోన్‌చేసి కోరినా సీఎస్‌ పట్టించుకోలేదు. సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డిలు... ‘ఐఏఎస్‌’ను జగన్‌ సివిల్‌ సర్వీస్‌గా మార్చారు. వారుసివిల్‌ సర్వీసు వదిలేసి.. వైకాపాలో చేరొచ్చుగా? వారిని ఎన్నికల సంఘం వెంటనే పదవుల నుంచి తొలగించాలి’ అని పేర్కొన్నారు.


సీఎం రమేశ్‌ నామినేషన్‌కు రక్షణమంత్రి రాక

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ వేస్తున్నట్లు భాజపా నేత సీఎం రమేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ హాజరవుతారని, సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.


విశాఖ ఉక్కుపై జగన్‌ మోసపూరిత వైఖరి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై మాట్లాడకుండా.. అందుకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటామని చెప్పడం మోసం చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏడాది కిందట పోరాట సమితి నాయకులను కలవడానికి ఒప్పుకోని ఆయన ఇప్పుడు వారిని పిలిపించుకొని మాట్లాడటంలో నిజాయతీ లేదని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.

సీఎం జగన్‌ కనీసం మాట ఇవ్వలేదు

‘ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా నిలబడతామని సీఎం జగన్‌ కనీసం మాట ఇవ్వలేదు. దీనిపై ఏనాడూ ప్రధాని మోదీకి వినతిపత్రం ఇవ్వలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కార్మికులను మోసం చేసేందుకు ప్రకటన చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోంది. భాజపాకు భయపడి వైకాపా సర్కారు విశాఖ ఉక్కును పణంగా పెట్టడం దారుణం. ఈ వ్యవహారంలో వైకాపా, తెదేపా, జనసేనలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయి’ అని శ్రీనివాసరావు ఆక్షేపించారు.


లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరో జాబితా విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓట్లు మావే.. పాలకులం కూడా మేమేనని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ అన్నారు. ఆరు ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో ఆరో జాబితాను మంగళవారం విడుదల చేశారు. సత్యవేడు నియోజకవర్గం నుంచి విజయ్‌ పోటీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img