icon icon icon
icon icon icon

దళిత బాధితులను ప్రతివాదులుగా చేర్చండి

శిరోముండనం కేసులో దళిత బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర దోషుల తరఫు న్యాయవాదులకు హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 24 Apr 2024 06:12 IST

ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం వారి వాదనలు వినాలన్న హైకోర్టు
శిరోముండనం కేసు తీర్పుపై అప్పీళ్ల విచారణ మే 1కి వాయిదా

ఈనాడు, అమరావతి: శిరోముండనం కేసులో దళిత బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర దోషుల తరఫు న్యాయవాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 15ఏ ప్రకారం బాధితుల వాదన వినాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. ప్రతివాదులుగా చేర్చేందుకు దోషుల తరఫు న్యాయవాదులు అంగీకరించడంతో విచారణను మే 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రవీంద్రబాబు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 1996 డిసెంబరు 29న రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, వారి మీసాలు, కనుబొమలు తీసేయించారు. ఈ కేసుకు సంబంధించి విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు 18 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఈ నెల 16న వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దోషులైన వైకాపా ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులతో పాటు మరో ఎనిమిది మంది హైకోర్టులో రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వాటిపై మంగళవారం విచారణ ప్రారంభం కాగానే దళిత బాధితుల తరఫున న్యాయవాదులు ఎన్‌.అశ్వనీకుమార్‌, జవ్వాజి శరత్‌చంద్రలు స్పందిస్తూ.. దోషులు దాఖలు చేసిన అప్పీళ్లలో బాధితులను ప్రతివాదులుగా చేర్చలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్‌ 15ఏ ప్రకారం వాదనలు చెప్పుకొనే అవకాశం బాధితులకు ఉందని తెలిపారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బాధితులను ప్రతివాదులుగా చేర్చాలని తోట త్రిమూర్తులు తరఫు సీనియర్‌ న్యాయవాది కె.చిదంబరానికి సూచించారు. విచారణను మే 1కి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img