icon icon icon
icon icon icon

ఈసీ నోటీసులిచ్చినా... లెక్కచేయని జగన్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయటంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులిచ్చినా ఆయన బేఖాతరు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.

Published : 24 Apr 2024 06:45 IST

ప్రత్యర్థులపై పదే పదే అనుచిత వ్యాఖ్యలు
చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిన సీఈఓ కార్యాలయం

ఈనాడు-అమరావతి:  ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయటంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి నోటీసులిచ్చినా ఆయన బేఖాతరు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. పదే పదే ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించింది. ఆయన ఎప్పుడెప్పుడు ఏయే వ్యాఖ్యలు చేశారు? అవి ఎలా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయో ఆ నివేదికలో పొందుపరిచింది. ఆయా వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదులనూ దీనికి జతచేసింది. సీఈసీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనుంది.

నోటీసులిచ్చినా... తీరు మార్చుకోని జగన్‌

తెదేపా అధినేత చంద్రబాబును శాడిస్టు, పశుపతి, చంద్రముఖి అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై ఈ నెల 7న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా.. సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ఆ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించగా జగన్‌ దానికి సమాధానం పంపించారు. అది సంతృప్తికరంగా లేకపోవటం, ఆ తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో జగన్‌... ఆయన రాజకీయ ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యల తీవ్రత, దుర్భాషలను మరింతగా పెంచారంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.


వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలు వద్దంటూ లేఖలు రాసినా

‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రకటనలు, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తనపై దాడి చేయడం, వారి హుందాతనాన్ని దెబ్బతీసేలా వ్యంగ్యంగా మాట్లాడటం, వారికి దురుద్దేశాలు ఆపాదించడం తదితర చర్యలన్నీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయి. ఇలాంటి వ్యాఖ్యల విషయంలో అభ్యర్థులు సంయమనం పాటించాలి.’’ అని పేర్కొంటూ మార్చి 1న ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది. అయినా వాటిని బేఖాతరు చేస్తూ జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపై నోటీసులిచ్చినా లెక్క చేయకుండా అదే అనుచిత వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో కొనసాగిస్తున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img