icon icon icon
icon icon icon

మా మామ అంబటికి ఓటేయొద్దు

జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, వైద్యుడు డాక్టర్‌ జి.గౌతమ్‌ ఓటర్లను కోరారు.

Updated : 06 May 2024 07:39 IST

ఓటర్లకు ఆయన అల్లుడు డాక్టర్‌ గౌతమ్‌ విజ్ఞప్తి
అలాంటి వారికి మద్దతిస్తే సమాజం నాశనమవుతుందని వ్యాఖ్య

ఈనాడు,అమరావతి-సత్తెనపల్లి, న్యూస్‌టుడే: జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, వైద్యుడు డాక్టర్‌ జి.గౌతమ్‌ ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని గౌతమ్‌ అందులో పేర్కొన్నారు. రోజూ తాను దేవుడికి దండం పెట్టుకునే సమయంలో ఇలాంటి వ్యక్తిని మళ్లీ తన జీవితంలోకి తీసుకురావద్దని వేడుకుంటున్నానని, అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో చేయాలా? లేదా? అని చాలాసార్లు ఆలోచించానని, చివరకు చేయడం తన బాధ్యతగా భావించి ముందుకొచ్చానని వెల్లడించారు. అంబటి ప్రజలకు సేవచేయాల్సిన పదవికి పోటీ చేస్తున్నందున తాను మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. ఏ పదవికైతే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అందులో కనీసం 0.01 శాతం కూడా లేని వ్యక్తి రాంబాబు అని మండిపడ్డారు. అంబటి లాంటి వ్యక్తికి ఓటేయడం అంటే నిస్సిగ్గుగా పెద్ద గొంతుతో ఎంత పెద్ద అబద్ధానైన్నా అరచి నిజం చేసిన వాళ్లకు, ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా సమాజంలో బతకొచ్చు అని అనుకునేవాళ్లకు ఓటేసినట్లు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి ఓటేస్తే ఇదే సమాజం తలరాతగా మారి.. రేపటి సమాజం దిగజారి పోయే ప్రమాదముందని హెచ్చరించారు. బాధ్యతతో ఓటువేసి సరైన నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొంటూ గౌతమ్‌ సెల్ఫీ వీడియో ముగించారు. ఈవీడియో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img