icon icon icon
icon icon icon

గుంటూరులో వైకాపా దుశ్చర్య

గుంటూరులో వైకాపా అరాచకపర్వానికి తెగబడింది. స్థానిక ఆటోనగర్‌లో కొన్ని పాత మోటారు వాహనాల విడిభాగాల దుకాణాలకు నిప్పుపెట్టి వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురిచేసింది.

Updated : 06 May 2024 06:47 IST

దుకాణాలకు నిప్పు.. రూ.50లక్షలకు పైగా ఆస్తి నష్టం
సమావేశానికి గైర్హాజరయ్యారని వ్యాపారులపై అక్కసు

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పెదకాకాని: గుంటూరులో వైకాపా అరాచకపర్వానికి తెగబడింది. స్థానిక ఆటోనగర్‌లో కొన్ని పాత మోటారు వాహనాల విడిభాగాల దుకాణాలకు నిప్పుపెట్టి వ్యాపారవర్గాలను భయభ్రాంతులకు గురిచేసింది. వైకాపా అభ్యర్థులు నిర్వహించిన సమావేశానికి వ్యాపారులు గైర్హాజరయ్యారనే అక్కసుతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని తెలిసింది. శనివారం ఆటోనగర్‌లో వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నూరి ఫాతిమా, కిలారి రోశయ్య పాత ఇనుప సామగ్రి వ్యాపారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కొందరు వ్యాపారులు వెళ్లలేదు. వెళ్లనివారంతా తెదేపా అనుకూలురన్న ఉద్దేశంతో.. ఆటోనగర్‌కు సెలవు రోజైన ఆదివారం ఎవరూ లేని సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులుగా కేసు నమోదుచేసి, వివరాలు తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజీలు సేకరించే పనిలో పడ్డారు. వైకాపా వర్గాలు మాత్రం తమకేమీ సంబంధం లేదని, దాని వెనుక ఎవరు ఉన్నారో పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుందని చెబుతున్నారు. ఈ ఘటనలో రూ.50లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. నాలుగు దుకాణాల పరిధిలో 40కి పైగా పాతకార్లు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని నాలుగు గంటలకు పైగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఆటోనగర్‌లో ఇలాంటి విషసంస్కృతిని ప్రోత్సహించిన వైకాపా నేతలకు ప్రజలే ఓటుతో గుణపాఠం చెబుతారని వ్యాపారులు హెచ్చరించారు.


అక్కసుతోనే దుశ్చర్య

-తెదేపా నేతలు

బాధిత దుకాణదారులు అందరూ తెదేపా సానుభూతిపరులే. విషయం తెలుసుకున్న తెదేపా గుంటూరు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వారు మాట్లాడుతూ గుంటూరు ఆటోనగర్‌లో శనివారం నిర్వహించిన సమావేశానికి స్థానికుల నుంచి స్పందన కరవైందని, ఆ అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. వ్యాపారులిచ్చిన ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇది వైకాపా నాయకుల పని

- మహబూబ్‌బాషా, బాధిత దుకాణదారుడు

‘ఆటోనగర్‌లో గత నెల 25న తెదేపా వాళ్లు నిర్వహించిన సమావేశానికి వ్యాపారులు ఎక్కువమంది హాజరయ్యారు. ఆ అప్పట్లోనే కొన్ని పాత వాహనాలకు నిప్పు పెట్టారు. దాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదు. రెండు రోజుల కిందట వైకాపా కార్యక్రమానికి వ్యాపారులు అంతగా హాజరుకాలేదని.. ఆ నేతలే తెరవెనుక ఉండి మా దుకాణాలకు నిప్పు పెట్టి ఆర్థికంగా నష్టం కలిగించారని భావిస్తున్నాం. ఇలాంటి చర్యలు అనైతికం.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img