icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలట్‌ ఓటుకు మరో అవకాశం

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Published : 06 May 2024 05:53 IST

7, 8 తేదీల్లో వెసులుబాటు
ఉత్తర్వులు ఇచ్చిన సీఈఓ

ఈనాడు డిజిటల్‌, అమరావతి-ఈనాడు, విజయనగరం: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగించుకునేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. ఉద్యోగుల ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దని రిటర్నింగ్‌ అధికారు(ఆర్వో)ల్ని ఆదేశించారు. ఓటు వినియోగానికి ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు సైతం ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఈ మేరకు ఆర్వోలకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదివారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘ఈ నెల 1 లోపు ఫాం-12 సమర్పించని వారికి.. ఓటరుగా నమోదైన నియోజకవర్గంలోనే ఫాం-12 సమర్పించేందుకు, ఫెసిలిటేషన్‌ సెంటర్లో ఓటు వినియోగానికి అవకాశం ఇవ్వాలి. ఓటరు వివరాలు, ఉద్యోగ నియామక పత్రం ధ్రువీకరించుకున్న తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ ఇప్పటికే ఆ ఉద్యోగికి జారీ చేయలేదని నిర్ధారించుకుని ఓటు వేయడానికి అనుమతించాలి. ఆర్వోలందరూ ఆ రెండు రోజులు ఫెసిలిటేషన్‌ సెంటర్లలో అందుబాటులో ఉండాలి’ సూచించారు.

ప్రలోభాలపై పటిష్ఠ నిఘా: ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రలోభాలను అరికట్టేందుకు పటిష్ఠమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఏర్పాట్లు, ఓటింగ్‌ ప్రక్రియ, హెల్ప్‌ డెస్క్‌లను తనిఖీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.450కోట్ల విలువైన నగదు, మద్యం, విలువైన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో సున్నిత, అతి సున్నితమైన 12,400 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని.. ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img