icon icon icon
icon icon icon

వారం ముందే నోట్ల కట్టలతో ఓట్ల వేట!

కరెన్సీ నోట్ల కట్టలతో గ్రామాల్లో ఓట్ల వేట మొదలుపెట్టారు. ఓ ప్రధాన పార్టీ వారం ముందుగానే నగదు సంచులను ఎక్కడికక్కడ చేరవేసింది.

Published : 06 May 2024 07:59 IST

గ్రామాలకు చేరిన ఓ ప్రధాన పార్టీ డబ్బు  
పంపకాలకు రాజంపేట బృందాలు  

కుక్కునూరు, న్యూస్‌టుడే: కరెన్సీ నోట్ల కట్టలతో గ్రామాల్లో ఓట్ల వేట మొదలుపెట్టారు. ఓ ప్రధాన పార్టీ వారం ముందుగానే నగదు సంచులను ఎక్కడికక్కడ చేరవేసింది. నగదు రవాణా నుంచి ఓటరుకు చేరే వరకు అంతా అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వచ్చిన బృందాలే చూసుకుంటున్నాయి. స్థానిక నాయకుల పాత్ర ఓటర్ల వద్దకు వారిని తీసుకెళ్లడం వరకే పరిమితం. మండలాలకు రాత్రికి రాత్రే నగదు చేరిపోయింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఇప్పటికే నగదు పంపిణీ ప్రారంభమైంది. ఓటుకు రూ.వెయ్యి వంతున ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై స్థానిక నాయకులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వారం ముందు పంపిణీ చేస్తే, పోలింగ్‌ రోజు మళ్లీ ఓటర్లు డబ్బులు అడిగితే అప్పుడు మేం ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు నుంచి కట్టుదిట్టమైన భద్రత ఉంటుందనీ, అందుకే ఇప్పుడే పంచాలనే ఆదేశాలున్నట్లు వారు బదులిచ్చినట్లు సమాచారం. ఈ అభ్యంతరాలు ఒకటి రెండు గ్రామాల్లోనే వ్యక్తమవ్వగా, మిగిలిన ప్రాంతాల్లో అంతా సాఫీగా సాగిపోతోంది. ఇదంతా ఉభయగోదావరి జిల్లాల్లో ఆ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఓ అగ్ర నాయకుడి కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో పంపిణీ ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img