icon icon icon
icon icon icon

రూ.13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి... ఏం అభివృద్ధి చేశారు జగన్‌?

ఏపీని భూ, ఇసుక, మద్యం మాఫియాలు పాలిస్తున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

Published : 06 May 2024 06:04 IST

ఏపీని మాఫియా పాలిస్తోంది
కడప ప్రజలూ సంతోషంగా లేరు  
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ధ్వజం

ఈనాడు, కర్నూలు, ఆదోని పాతపట్టణం, కొండాపురం, న్యూస్‌టుడే: ఏపీని భూ, ఇసుక, మద్యం మాఫియాలు పాలిస్తున్నాయని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శించారు. రూ.13.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు, కర్నూలు జిల్లా ఆదోని భీమాస్‌ సర్కిల్‌లో ఆదివారం నిర్వహించిన ప్రచార సభల్లో రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొని మాట్లాడారు. జగన్‌ హయాంలో ఆయన సొంత ప్రాంతమైన కడప ప్రజలూ సంతోషంగా లేరని, ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌  దారుణంగా ఉందని, వైకాపా పాలించే అర్హత కోల్పోయిందన్నారు. జగన్‌ జమానాలో ల్యాండ్‌ మాఫియా, భూ మాఫియా, లిక్కర్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియా... పేట్రేగిపోయాయని విమర్శించారు. ఒకప్పుడు సంపన్న రాష్ట్రంగా వర్ధిల్లిన ఏపీ వైకాపా పాలనలో పేద రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 21.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే 2.32 లక్షల గృహాల్నే కట్టారని, పూర్తయిన వాటినీ పేదలకు ఇవ్వలేదని గుర్తుచేశారు. అమృత్‌ మిషన్‌ కింద రూ.14,500 కోట్లు  కేటాయించి, ఇంటింటికీ మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని సూచిస్తే.. వైకాపా ప్రభుత్వం మాత్రం రూ.1,400 కోట్లే ఖర్చు చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలు తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులను గెలిపిస్తే... ఏపీకి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img