icon icon icon
icon icon icon

డబ్బు తీసుకోలేదని.. ఎస్టీ ఉద్యోగిపై వైకాపా మూకదాడి

ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు.

Updated : 06 May 2024 07:37 IST

చితకబాదుతున్నా పోలీసుల ప్రేక్షక పాత్ర
అనుచరులతో కలిసి కార్పొరేటర్‌ భర్త అరాచకం

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-విజయవాడ నేరవార్తలు: ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు. డబ్బు తీసుకోలేదన్న అక్కసుతో వైకాపా కార్పొరేటర్‌ భర్త ఆయనను చావబాదారు. ఇంట్లోకి వెళ్లి ఆయన భార్య, పిల్లలపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నా.. ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. విజయవాడలో ఆదివారం కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలివి.. ఏలూరు జిల్లా నూజివీడు తహసీల్దారు కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న మనోజ్‌కుమార్‌.. విజయవాడ విశాలాంధ్ర కాలనీలో ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం వైకాపాకు చెందిన కొందరు మహిళలు పోస్టల్‌ బ్యాలట్‌కు డబ్బులు పంపిణీ చేస్తూ మనోజ్‌ ఇంటికి వచ్చారు. తాను శనివారమే ఓటు వేశానంటూ మనోజ్‌ డబ్బులు వద్దన్నారు. ఇంతలో ఓ మహిళా నాయకురాలు ఈ విషయాన్ని చెప్పడంతో వైకాపా కార్పొరేటర్‌ తిరుపతమ్మ భర్త మోదుగుల గణేష్‌, రవి, మరికొందరు అక్కడకు వచ్చారు. ఇంట్లో ఉన్న మనోజ్‌ను బయటకు పిలిచి తీవ్రంగా కొట్టి దుస్తులు చించారు. కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడారు. వారిలో లొడగాని నాగరాజు అనే వైకాపా నాయకుడు తీవ్రంగా దుర్భాషలాడుతూ.. ఇంటిపైకి దూసుకుపోయారు. ఆయనతోపాటు మరికొందరూ గొడవకు దిగారు. పూలకుండీతో మనోజ్‌కుమార్‌ తలపై కొట్టారు. కుర్చీతో కుటుంబసభ్యులపై దాడులకు తెగబడ్డారు.

కిమ్మనని ఖాకీలు: గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వచ్చినా.. దాడి ఘటనను చూస్తూనే నిలబడిపోయారు. కనీసం బాధితుడిని తప్పించే ప్రయత్నం కూడా చేయలేదు. అడ్డుకునేందుకు వచ్చిన మనోజ్‌ సోదరుడు యశ్వంత్‌పైనా వైకాపా నాయకులు దాడిచేశారు. ఈ దాడి గురించి సమాచారం చెప్పేందుకూ పోలీసులు ఇష్టపడడం లేదు. అది చిన్న కేసు అని, విచారణ చేయాల్సి ఉందని నున్న సీఐ దుర్గాప్రసాద్‌ చెబుతున్నారు. దాడిపై మనోజ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం నున్న పోలీసులకు ఫిర్యాదుచేశారు. మోదుగుల గణేష్‌, రవి, మరో 20మంది తన ఇంటిపై దాడిచేశారని పేర్కొన్నారు.  ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లిన మనోజ్‌.. ఆ తర్వాత కనిపించకుండా పోయారని ఆయన భార్య రత్నప్రియ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన భర్తను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నట్లు చెప్పారని, ఆ తర్వాత కనిపించలేదన్నారు. తన భర్త ఆచూకీ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img