icon icon icon
icon icon icon

జగన్‌ మొత్తం ఆస్తులు రూ.8.23 లక్షల కోట్లు

ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తిని రూ.757 కోట్లుగా చూపించిన సీఎం జగన్‌ అసలు ఆస్తి బినామీలతో కలిపితే రూ.8,23,600 కోట్లని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.

Updated : 06 May 2024 07:04 IST

ఎలహంక, లోటస్‌పాండ్‌ ప్యాలెస్‌లు, సాక్షిలో వాటా వివరాలు అఫిడవిట్‌లో లేవు
తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తిని రూ.757 కోట్లుగా చూపించిన సీఎం జగన్‌ అసలు ఆస్తి బినామీలతో కలిపితే రూ.8,23,600 కోట్లని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని రూ. 300 కోట్ల విలువ చేసే ప్యాలెస్‌, బెంగళూరులో 30 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌, వాణిజ్య భవనం, సాక్షిలో తనకు, తన భార్య భారతిరెడ్డికి ఉన్న వాటాల్ని అఫిడవిట్‌లో చూపించలేదని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆనం వెంకటరమణారెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం నాటి ధరలనే చూపిస్తూ జగన్‌ తన ఆస్తుల వాస్తవ విలువను దాచిపెట్టారని మండిపడ్డారు. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వ ఆస్తులే రాలేదన్న జగన్‌రెడ్డి.. ఇన్ని రూ.లక్షల కోట్లను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. 2004 అఫిడవిట్‌లో నికర ఆస్తులు రూ.1.74 కోట్లుగా చూపించిన ఆయన.. తండ్రి సీఎం అవ్వగానే పెద్ద మొత్తంలో ఆస్తులను ఎలా కూడబెట్టారని విరుచుకుపడ్డారు. జగన్‌పై ఈడీ, సీబీఐ నమోదు చేసిన 32 తీవ్రమైన కేసులు.. హవాలా, మనీ లాండరింగ్‌కు సంబంధించినవేనని తెలిపారు.

మద్యం, భూ దోపిడీ ద్వారానే..రూ.రెండు లక్షల కోట్ల కమీషన్‌

మద్యం, ఎసైన్డు భూముల దోపిడీ ద్వారానే రూ. 2.05 లక్షల కోట్లు జగన్‌కు కమీషన్‌గా వచ్చాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ‘‘బినామీ కంపెనీ ఇండోసోల్‌కు విద్యుత్తు ప్రాజెక్టులు, భూములు కట్టబెట్టడం ద్వారా రూ.75 వేల కోట్లు, టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో రూ.50 వేల కోట్లు, ఇసుక, విశాఖ భూ దోపిడీల్లో రూ.లక్ష కోట్లు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా రూ.25 వేల కోట్లు, బాక్సైట్‌, గ్రావెల్‌, సిలికా, బీచ్‌ శాండ్‌, క్వార్ట్జ్‌ అక్రమ మైనింగ్‌తో రూ.54 వేల కోట్లను జగన్‌ దోచుకున్నారు..’’ అంటూ పలు వివరాలను వెల్లడించారు.

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో చూపిస్తే బండారం బయటపడుతుందని.. 

‘‘అఫిడవిట్‌లో జగన్‌ చూపించిన కంపెనీల్లో ఒక్కటి కూడా లిమిటెడ్‌ కంపెనీ లేదు. అన్నీ ప్రైవేటువే. లిమిటెడ్‌ కంపెనీలైతే వాటిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో చూపించాలి. అలా చేస్తే తన బండారం బయటపడుతుందనే భయంతో జగన్‌ లిమిటెడ్‌ కంపెనీ పెట్టలేదు’’ అని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జగన్‌కు వైఎస్‌ రాజశేఖరరెడ్డి బహుమతిగా ఇచ్చిన ఆస్తులపైనా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌-2లో ఉన్న ఇంటిని జగన్‌కు, పులివెందులలో ఉన్న కొన్ని ఆస్తుల్ని భారతిరెడ్డికి వైఎస్‌ బహుమతిగా ఇచ్చారు. షర్మిలకు ఇవ్వకుండా జగన్‌ దంపతులకే ఆయన వాటిని ఎందుకిచ్చారు? వీటిపై దర్యాప్తు జరిపించాలి’’ అని ఆనం డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img