icon icon icon
icon icon icon

అప్పులు చేశారు.. పన్నులు పెంచారు

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రూ.వేల కోట్ల పన్నులు వసూలు చేసి, అంతకంటే ఎక్కువగా అప్పులు తీసుకొచ్చినా.. రాష్ట్రాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

Published : 06 May 2024 05:44 IST

ధరలు, ఛార్జీల పెరుగుదలపై సీఎం జగన్‌ను ప్రశ్నించిన షర్మిల
‘నవ సందేహాలు’ పేరుతో మరో బహిరంగ లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో రూ.వేల కోట్ల పన్నులు వసూలు చేసి, అంతకంటే ఎక్కువగా అప్పులు తీసుకొచ్చినా.. రాష్ట్రాభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తోందని ప్రశ్నించారు. ధరలు, ఛార్జీల పెరుగుదలపై ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు 9 ప్రశ్నలు వేస్తూ ఆదివారం మరో లేఖ రాశారు.  

షర్మిల సంధించిన ప్రశ్నలు

1. ధరలు పెరుగుదలతో ప్రజలపై పడిన ఆర్థిక భారాన్ని తగ్గించే ఉపశమన చర్య ఐదేళ్లలో ఒక్కటీ ఎందుకు తీసుకోలేదు?

2. రైతులకు గిట్టుబాటు ధరతో సంబంధం లేకుండా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎందుకు చేయలేదు?

3. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి.. ప్రజల మీద రూ.1300 కోట్ల భారాన్ని ఎందుకు మోపారు?

4. పన్నులు విపరీతంగా పెంచి పెట్రోల్‌, డీజిల్‌ మీద రూ.500 కోట్లు, ఆర్టీసీ ఛార్జీల ద్వారా రూ. 700 కోట్లు, మద్యంపై రూ. 1800 కోట్ల భారాన్ని ప్రజలపై ఎందుకు మోపారు?

5. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పన్నుల కింద తగ్గించే అవకాశం ఉన్నా.. ఎందుకు తగ్గించలేదు?

6. యూనివర్సిటీల్లో ప్రమాణాలు పెంచకుండా ఫీజులను ఎందుకు పెంచారు?

7. ఇసుక ధరలను 5 రెట్లు పెంచి, నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. 40 లక్షల మంది కార్మికుల జీవనోపాధిపై ఎందుకు దెబ్బ కొట్టారు?

8. ఈ ఏడాదిలోనే రూ.10 వేల కోట్ల పన్నులు పెంచారు. అదే స్థాయిలో రూ.47 వేల కోట్ల అప్పులు తెచ్చారు. అయినా అభివృద్ధి శూన్యం. దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు?

9. వైఎస్సార్‌ హయాంలో రేషన్‌ దుకాణాల్లో 11 నిత్యావసరాలు అందేవి. ఇప్పుడు బియ్యం తప్ప ఏవీ ఎందుకు ఇవ్వడం లేదు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img