icon icon icon
icon icon icon

వైకాపా పాలనలో అన్నీ హత్యా రాజకీయాలే

‘రాష్ట్రమంతా దొంగలు రాజ్యమేలుతున్నారు. ఇసుక, మట్టి, సిలికా, గ్రావెల్‌ దోచుకుంటున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో చేసినదంతా హత్యా రాజకీయాలు మాత్రమే. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి.. మరో ఆరునెలలు పనిచేస్తారు.

Published : 06 May 2024 05:47 IST

ప్రతిపక్షంలో పులిలా.. అధికారం వచ్చాక పిల్లిలా జగన్‌
కాంగ్రెస్‌ అధికారంలో వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా
కోవూరు ప్రచారసభలో పీసీసీ చీఫ్‌ షర్మిల

ఈనాడు-నెల్లూరు, న్యూస్‌టుడే-కోవూరు: ‘రాష్ట్రమంతా దొంగలు రాజ్యమేలుతున్నారు. ఇసుక, మట్టి, సిలికా, గ్రావెల్‌ దోచుకుంటున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో చేసినదంతా హత్యా రాజకీయాలు మాత్రమే. కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోయి.. మరో ఆరునెలలు పనిచేస్తారు. మన ముఖ్యమంత్రి నాలుగున్నరేళ్లు నిద్రపోయి.. చివరి ఆరు నెలల్లో హడావుడి చేశారు’ అని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఆదివారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు. ‘ప్రత్యేకహోదా వచ్చి ఉంటే.. రాష్ట్రం మరోలా ఉండేది. చంద్రబాబు, జగన్‌ రాజకీయంగా ఆ అంశాన్ని వాడుకున్నారు తప్ప.. సాధించింది లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ పులిలా మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక పిల్లి అయ్యారు. ప్రజల నెత్తిన టోపీ.. చేతిలో చిప్ప పెట్టారు’ అని షర్మిల తీవ్రంగా విమర్శించారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ

‘పదేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేదు. పక్కనే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏముంది? రాష్ట్రాన్ని బాబు, జగన్‌ దారుణంగా మోసం చేశారు. జగన్‌ వైఎస్‌ఆర్‌ వారసుడైతే.. ఆయన ఆశయాలు ఎందుకు అమలుచేయలేదు? మెగా డీఎస్సీ అని.. చివరకు దగా డీఎస్సీ ప్రకటించారు. రైతులకు ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. పంట నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. మద్యపాన నిషేధం అని చెప్పి.. చివరకు ప్రభుత్వ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలను తీస్తున్నారు’ అని షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవలేని భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి భాజపాను తీవ్రంగా వ్యతిరేకిస్తే.. జగన్‌  ఆ పార్టీతో డ్యూయెట్లు పాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా తెస్తామని.. నెల్లూరు ఎంపీగా కొప్పుల రాజును, కోవూరు ఎమ్మెల్యేగా కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img