icon icon icon
icon icon icon

పోటెత్తిన పిఠాపురం

పిఠాపురం పోటెత్తింది.. అభిమానులు, ప్రజల ఉత్సాహంతో ఉప్పాడ సముద్రమే పొంగిందా అన్నట్లు కనిపించింది. ఎటుచూసినా కూటమి పార్టీల జెండాలు, ‘పవన్‌.. పవన్‌..’ అంటూ అభిమానుల నినాదాలు.. దిష్టి తీసి, హారతులు ఇస్తూ.. విజయోస్తు అంటూ దీవించిన మహిళలు..

Published : 24 Apr 2024 06:44 IST

భారీ ర్యాలీతో పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌
హారతులు ఇచ్చి.. దీవించిన మహిళలు

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, పిఠాపురం: పిఠాపురం పోటెత్తింది.. అభిమానులు, ప్రజల ఉత్సాహంతో ఉప్పాడ సముద్రమే పొంగిందా అన్నట్లు కనిపించింది. ఎటుచూసినా కూటమి పార్టీల జెండాలు, ‘పవన్‌.. పవన్‌..’ అంటూ అభిమానుల నినాదాలు.. దిష్టి తీసి, హారతులు ఇస్తూ.. విజయోస్తు అంటూ దీవించిన మహిళలు.. పూలు జల్లుతూ, జేజేలు పలుకుతూ కేరింతలు కొట్టిన అభిమానులు.. జనసందోహంతో కిక్కిరిసిన దారులు.. మంగళవారం జనసేనాని పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా కనిపించిన దృశ్యాలివి. భారీ జనసందోహం నడుమ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన ర్యాలీ 14 కి.మీ. మేర నాలుగు గంటలపాటు కోలాహలంగా సాగింది.

హనుమాన్‌ జయంతి రోజున తన ఇష్టదైవమైన ఆంజనేయునికి చేబ్రోలులోని నివాసంలో పూజలు చేసిన పవన్‌ కల్యాణ్‌.. అనంతరం నామినేషన్‌ ర్యాలీ ప్రారంభించారు. గోకుల్‌ గ్రాండ్‌ హోటల్‌లో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మ, ఆయన సతీమణి లక్ష్మీదేవి ఆయనకు తిలకం దిద్దారు. సోదరుడు నాగబాబు ఆశీర్వదించారు. సర్వమత ప్రార్థనలు, వేదపండితుల దీవెనలు అందుకున్నారు. పవన్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే వర్మ, భాజపా ఇన్‌ఛార్జి బుర్రా కృష్ణంరాజు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్వో కార్యాలయం జాతీయ రహదారి పక్కనే ఉండటంతో పవన్‌ రాక సందర్భంగా కొంతసేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. పిఠాపురం పట్టణం నుంచి  వాహనాలను మళ్లించి పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు. పవన్‌ కల్యాణ్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి రామసుందర్‌రెడ్డికి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img