icon icon icon
icon icon icon

రాష్ట్రంలో పోస్టల్‌ బ్యాలట్‌ విధానం అస్తవ్యస్తం

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలట్‌ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

Published : 05 May 2024 06:43 IST

దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఈసీకి తెదేపా లేఖ

దిల్లీ, ఈనాడు : ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలట్‌ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న కారణంతో పోస్టల్‌ బ్యాలట్‌ విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చి ఉద్యోగులు ఓటేయకుండా చేయాలన్న కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ శనివారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలట్‌ సమాచారం తెలిపే కేంద్రం, పని వేళలు, ఫాం-12 సమర్పించే విధానం గురించి ప్రతి జిల్లా ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో స్పష్టంగా పొందుపరచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా ఆయా సైట్లలో వివరాలు కనిపించలేదు. ఉద్యోగుల ఓట్లు తగ్గించేందుకు అధికార పార్టీ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయినా.. ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఫలితంగా వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.  కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవస్థను పర్యవేక్షించేలా రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిని ఆదేశించాలి. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకొనేలా చర్యలు చేపట్టాలి’’ అని కనకమేడల లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఓటును ధ్రువీకరిస్తూ గెజిటెడ్‌ అధికారులు స్టాంప్‌ వేసి సంతకం పెట్టాల్సి ఉన్నా చాలా చోట్ల ముద్ర వేయకుండా కేవలం సంతకం పెట్టి ఓట్లు చెల్లకుండా ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఫాం-12 సమర్పించడానికి ఈనెల 6వ తేదీ వరకూ గడువు పొడిగించాలని డిమాండు చేశారు. ఎన్నికల విధుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్తున్న పోలీసు సిబ్బందీ పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేలా చూడాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img