icon icon icon
icon icon icon

సూళ్లూరుపేట అధికార పార్టీలో వర్గపోరు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైకాపాలో నెలకొన్న వర్గపోరు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నామినేషన్‌ కార్యక్రమంలో మరోసారి బహిర్గతమైంది.

Published : 26 Apr 2024 09:11 IST

వైకాపా నేతపై చెప్పుతో దాడికి అదే పార్టీ నేత యత్నం
సంజీవయ్య నామినేషన్‌ కార్యక్రమంలో ఘటన

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైకాపాలో నెలకొన్న వర్గపోరు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నామినేషన్‌ కార్యక్రమంలో మరోసారి బహిర్గతమైంది. వాగ్వాదం ముదిరి చెప్పుతో దాడికి యత్నించేవరకూ వెళ్లింది. వైకాపా అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య గురువారం నామినేషన్‌ వేసేందుకు నాయుడుపేట నుంచి వందల వాహనాలతో సూళ్లూరుపేటలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అందరూ కలిసి, తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేయాల్సి ఉంది. ఈ సమయంలో ప్రచార రథంపైకి ఎమ్మెల్యేతోపాటు చెంగాళమ్మ ఆలయ ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్‌ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైకాపా పట్టణ అధ్యక్షుడు కళత్తూరు శేఖర్‌రెడ్డి, పుర ఛైర్మన్‌ శ్రీమంత్‌రెడ్డితోపాటు మరికొందరు ఎక్కారు. కొంతసేపటికి ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ప్రచార రథంపైకి ఎక్కి ఎమ్మెల్యే సంజీవయ్య, బాలచంద్రారెడ్డిని పక్కకు నెట్టి మధ్యలోకి వచ్చి నిలుచున్నారు. ఆ సమయంలో చివర్లో ఉన్న శేఖర్‌రెడ్డి ముందుకు తూలి వాహనం బానెట్‌పైకి పడుతుండగా సత్యనారాయణరెడ్డి ఒక్కసారిగా ‘వీడిని ఎందుకు ఎక్కించారు..దించండి’ అంటూ కేకలు వేశారు. వెంటనే శేఖర్‌రెడ్డి కలగజేసుకోవడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే ఎంత వారిస్తున్నా వారు వినలేదు. ఓ దశలో శేఖర్‌రెడ్డి చెప్పు తీసుకుని దాడి చేసేందుకు యత్నిస్తుండగా, బాలచంద్రారెడ్డి అడ్డుకున్నారు. ఈలోగా సీఐ మధుబాబు వెంటనే వాహనంపైకి ఎక్కి సత్యనారాయణరెడ్డికి సర్దిచెప్పి వాహనం దిగి వెళ్లిపొమ్మని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఆ తరవాత వారు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని నామినేషన్‌ వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img