icon icon icon
icon icon icon

‘మీరు అడ్డా మార్చినా..’ మీ ఆగడాలను జనం మరిచేనా!

పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల ‘మంచితనా’నికి మచ్చుతునకలివి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్‌, మార్కాపురానికి కె.బి.నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

Published : 26 Apr 2024 05:48 IST

పశ్చిమ ప్రకాశంలో వైకాపా ప్రజాప్రతినిధుల అరాచకాలు
జనం తిరస్కరిస్తారని ఏడాది క్రితమే అధిష్ఠానానికి స్పష్టత
నియోజకవర్గాలు మార్చి, మళ్లీ ఎన్నికల బరిలోకి
అలాంటివారు మా నెత్తిన ఎందుకని జనం ప్రశ్న
ఈనాడు, అమరావతి

  • ఓ ఉపాధ్యాయుడు కష్టార్జితంతో స్థలం కొన్నారు. దానిపై కన్నేసిన ప్రజాప్రతినిధి సోదరుడు ఆ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించాడు. కోర్టులో వివాదం నడుస్తుండగానే రూ.10 కోట్ల విలువైన స్థలాన్ని అప్పనంగా కాజేశాడు. మార్కాపురం పట్టణంలో జరిగిన ఈ భూదందా ప్రజల్లో ఆందోళన కలిగించింది.
  •  తమ ప్రాంతానికి రోడ్డు వేయలేదని ప్రశ్నించిన పాపానికి జనసేన కార్యకర్తను ఎమ్మెల్యే స్వయంగా అవమానించారు. ఆపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. తిరిగొచ్చాక అవమానం భరించలేని ఆ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. గిద్దలూరు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.
  •  ఇంజినీరింగ్‌ కళాశాల పేరుతో 90 ఎకరాలు, త్రిపురాంతకంలో 365 ఎకరాలు, యర్రగొండపాలెంలో రూ.40 కోట్ల విలువైన అసైన్డ్‌ భూముల ఆక్రమణ.. ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగ్‌లలో అవినీతి.. వెరసి రూ.వందల కోట్లు కూడబెట్టారంటూ ఓ మంత్రిపై యర్రగొండపాలెంలో ప్రతిపక్షాలు ఏకంగా కరపత్రాలు పంచాయి.

పశ్చిమ ప్రకాశం జిల్లాలో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేల ‘మంచితనా’నికి మచ్చుతునకలివి. గత ఎన్నికల్లో వైకాపా తరఫున గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, యర్రగొండపాలెం నుంచి ఆదిమూలపు సురేష్‌, మార్కాపురానికి కె.బి.నాగార్జునరెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సురేష్‌కు కేబినెట్‌లో చోటుదక్కింది. వీరు ఐదేళ్ల పదవీకాలంలో సమస్యలను గాలికొదిలేశారు. తమ తరఫున షాడో ఎమ్మెల్యేలను ముందుకుతెచ్చి, వారికి నియోజకవర్గాలను రాసిచ్చారు. అక్కడ ఏం చేయాలన్నా ఈ బినామీలకు కప్పం కట్టాల్సిందే. భూ ఆక్రమణలు, దందాలు, ప్రైవేటు పంచాయతీలు, కాంట్రాక్టులు, కమీషన్లతో ఐదేళ్లూ రెండు చేతులా వెనకేసుకున్నారు.

నమ్మకాన్ని సొమ్ము చేసుకొని..

ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు జనంలోనే కాదు, పార్టీ అధిష్ఠానం వద్దా నమ్మకం కోల్పోయారు. మళ్లీ అక్కడే పోటీచేస్తే డిపాజిట్లూ రావని గుర్తించిన అధినేత జగన్‌.. ముగ్గురి స్థానాలను అటూఇటూ మార్చారు. పాత నియోజకవర్గాల్లో అంటిన అవినీతి మరకను కొత్త స్థానాల్లో డబ్బుతో కడుక్కోవచ్చనే ధీమాతో వీరు ఎన్నికల బరిలోకి దిగారు. స్థానాలు మారినంత మాత్రాన నేతల ఆగడాలు, అరాచకాలను జనం మరిచిపోలేదని స్పష్టమవుతోంది. వారి దురాగతాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెస్తున్నారు. ‘ఈనాడు ప్రత్యేక ప్రతినిధి’ మూడు రోజులపాట ఈ నియోజకవర్గాల్లోని ముండ్లపాడు, మార్కాపురం, గౌరవంతపాడు, మాల్యవంతునిపాడు, రామచంద్రాపురం, తిప్పాయపాలెం, కాటూరివారిపాలెం, తర్లుపాడు, కారుమానుపల్లె, మిర్జాపేట, కొండెపల్లి, నరసింహాపురం, పొదిలి, కంబాలపాడు, దరిమడుగు తదితర గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వ పనితీరు, రాజకీయ పరిస్థితులపై  రైతులు, విద్యార్థులు, గ్రామస్థులను ప్రశ్నించినపుడు ఆచితూచి స్పందించారు. మా మాటలు రికార్డు చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా పంపారా? ఉన్నది ఉన్నట్లు చెబితే పోలీసులు కేసులు పెడతారేమోనన్న భయాందోళన వారిలో వ్యక్తమైంది.

కొల్లగొట్టిన సొమ్ముతో ఓట్ల వేట

ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం జగన్‌ పలుమార్లు హెచ్చరించినా దారికి రాలేదు. ఇంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న వీరికి మళ్లీ టికెట్‌ ఇస్తే ఓడిపోతారని ఏడాది క్రితమే పార్టీ చేయించిన సర్వేల్లో తేలింది. మంత్రి సురేష్‌కు యర్రగొండపాలెంలో డిపాజిట్‌ కూడా దక్కదని సొంత పార్టీ నేతలే జగన్‌కు వినతిపత్రమిచ్చారు. తమకు సీటు దక్కకుంటే తాడేపల్లి ప్యాలెస్‌ గుట్టు విప్పుతానని వీరిలో ఓ ఎమ్మెల్యే బెదిరించే వరకూ వెళ్లారని సమాచారం. గత్యంతరం లేక అధిష్ఠానం ముగ్గురి స్థానాలను మార్చింది. అన్నా రాంబాబును గిద్దలూరు నుంచి మార్కాపురానికి.. అక్కడి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు బదిలీ చేసింది. ఆదిమూలపు సురేష్‌ను కొండపికి పంపి, యర్రగొండపాలెంలో కొత్త అభ్యర్థి చంద్రశేఖర్‌ను పోటీకి దింపింది. అడ్డా మారిన అభ్యర్థులతో పాటు అక్రమాలూ బదిలీ అవుతాయని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరు కులాలు, మతాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ, అప్పనంగా సంపాదించిన సొమ్మును వెదజల్లుతున్నారు. ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్తులకు డబ్బు ఎర వేసి తమవైపు లాక్కొంటున్నారు. ఓ అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా 20 వేల మందితో బలప్రదర్శన చేశారు. ఒక్కొక్కరికి రూ.500, ఐదు రకాల వంటకాలతో విందు ఇచ్చారని సమాచారం.

అక్రమాలు.. ఆక్రమణలు.. అరాచకాలు

యర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే వద్దకెళితే దర్శనమే కష్టమని త్రిపురాంతకం మండలానికి చెందిన ఒక రైతు తెలిపారు. ‘మీరు జగన్‌ను చూసి ఓటేశారు. నాకు కాదు. ఆయనకే చెప్పుకోండంటూ ఎగతాళి చేసేవార’ని అయ్యంగొట్లపాలెం గ్రామ రైతులు చెప్పారు. నియోజకవర్గంలో ఏడు రోడ్లకు శంకుస్థాపన చేసినా, రెండు మాత్రమే వేశారని రేళ్లపల్లివాసి వివరించారు. సురేష్‌ మంత్రి అయినా మా ఊళ్లకు చింతాకంత పని చేయలేదని పుల్లలచెరువు వాసి, విశ్రాంత ఉద్యోగి వాపోయారు. సొంతూరికీ ఏమీ చేయలేకపోయారని జనం పెదవి విరిచారు. ఉపాధ్యాయుల పోస్టింగ్స్‌, విద్యాసంస్థల అనుమతుల కోసం షాడో నాయకురాలు చెప్పిందే రేటు అన్నట్టుగా దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి.

  •  ఐదేళ్లలో మార్కాపురంలో భూకబ్జాలు పెచ్చుమీరాయని ఓ యువకుడు ఆవేశంగా చెప్పాడు. ‘ఎమ్మెల్యే బంధువులు అందినకాడికి దోచుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడికి చెందిన రూ.10 కోట్ల స్థలాన్ని, అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్నారు. వారికి అధికారులు, పోలీసులు సహకరించారు. బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేయించార’ని వివరించాడు. ఎమ్మెల్యే అనుచరులు కొత్త వెంచర్ల వద్ద వాలిపోవడం, వివాదాస్పద భూములను తక్కువ ధరకు సొంతం చేసుకోవటం, వినని వారిపై అట్రాసిటీ కేసులు పెట్టించడం ఇక్కడ మామూలేనని పట్టణంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాపోయారు.
  • గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును కలవాలంటే ముందుగా దళారులను ఆశ్రయించాలంటూ ముండ్లపాడు గ్రామ యువకులు వాపోయారు. కష్టాలు చెప్పుకొనేందుకు వెళ్లిన వారిని ఎమ్మెల్యే పరుషంగా తిట్టేవారన్న అపవాదు ఉంది. ఆయన తరఫున ఒక సామాజికవర్గ నాయకుడు చక్రం తిప్పేవాడని, కులాల వారీగా విభజించి గిట్టనివారిని వేధించేవారని పేర్కొన్నారు. అసైన్డ్‌ భూముల ఆక్రమణ, జొన్నల కొనుగోలు అక్రమాల్లో ఎమ్మెల్యే కుటుంబసభ్యుల పాత్రపై ఆరోపణలున్నాయి. 

ఓటేయని జనంపై ఇంతటి కక్షా?

నల్లమల అటవీ ప్రాంతంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు. ఐదేళ్లలో సాగు, తాగునీటి కష్టాలను దూరంచేసే ఏ పనులనూ ఇక్కడి ఎమ్మెల్యేలు చేయలేదు. ఈ ఏడాది కరవు కారణంగా ఒక్క మార్కాపురం మండలంలోనే రైతులు సుమారు 20 వేల బోర్లు వేశారు. వెలిగొండ ప్రాజెక్టు లక్ష్యం సిద్ధించలేదు. వైకాపా నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్రామాల్లో నీటి ట్యాంకర్లతో మంచినీరు అందిస్తున్నారు. తమ ఊళ్లలో గత ఎన్నికల్లో వైకాపాకు మెజార్టీ రాలేదన్న అక్కసుతో నీటి సరఫరా నిలిపివేశారని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులను వైకాపా సర్కారు నిమిత్తమాత్రులను చేసిందని ఓ సర్పంచి గుర్తుచేశారు. ‘ఐదేళ్లలో ఒక్క రోడ్డూ వేయలేదు. బటన్లు నొక్కడం మినహా ఇంకేం చేయరా అని జనం ప్రశ్నిస్తుంటే తలెత్తుకోలేక పోతున్నామ’ని తెలిపారు. ప్రజలు విరాళాలతో విద్యుత్‌ దీపాలు అమర్చుకున్నారని పొదిలికి చెందిన విశ్రాంత ఉద్యోగి తెలిపారు. ‘తెదేపా ప్రభుత్వంలో మాకు రాయితీలు వచ్చేవి. ఇప్పుడు ఎత్తేశారు. పట్టు సాగును నమ్ముకున్న కుటుంబాలు తగ్గిపోయాయి. ప్రకృతి కంటే ప్రభుత్వమే ఎక్కువ దెబ్బతీసింది’ అని పొదలకొండపల్లెకు చెందిన రైతులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img