icon icon icon
icon icon icon

బుగ్గన నామినేషన్‌పై అభ్యంతరాలు బేఖాతరు

నంద్యాల జిల్లా డోన్‌ అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌ను తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు.

Published : 27 Apr 2024 05:52 IST

గడువు దాటాక ఆర్వో ఆమోదం
తెదేపా న్యాయవాదులకు బెదిరింపులు

ఈనాడు, డోన్‌, కర్నూలు: నంద్యాల జిల్లా డోన్‌ అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌ను తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆమోదించారు. ఈ సందర్భంగా డోన్‌లో రోజంతా హైడ్రామా నడిచింది. బుగ్గన ఈనెల 22న నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్లో కొన్ని కాలమ్స్‌ను నింపకుండా ఖాళీగా వదిలేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. బుగ్గన ప్రధాన అఫిడవిట్లో ఆస్తుల విలువ రాశారు గానీ, వాటి సమగ్ర వివరాలు పేర్కొనలేదు. ఆ వివరాలు అనుబంధ పత్రాల్లో పొందుపరిచినట్లు పేర్కొన్నప్పటికీ, వాటిని ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని ప్రస్తావించారే తప్ప, ఆ సాక్ష్యాలను ఆర్వోకు సమర్పించారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇలా గోప్యత పాటించడంపై అనుమానాలు తలెత్తాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా కోట్ల తరఫు న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌ భట్‌లు ఈ లోపాలను ఆర్వో మహేశ్వర్‌రెడ్డి వద్ద లేవనెత్తారు. నామినేషన్‌ తిరస్కరించడానికి బలమైన కారణాలున్నాయని వాదించారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచారమిచ్చి తగిన నిర్ణయం తీసుకుంటానని ఆర్వో తొలుత పెండింగులో పెట్టారు.

సాయంత్రం వరకూ సాగదీత

నామినేషన్ల పరిశీలన, తిరస్కరణకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకే గడువుంది. బుగ్గన నామినేషన్‌పై ఐదింటి వరకూ ఆర్వో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, అధికారులు ఇచ్చిన నోటీసులకు బుగ్గన తరఫు న్యాయవాదులు సాయంత్రం సమాధానాలిచ్చారు. వాటి ఆధారంగా నామినేషన్‌ను ఆమోదిస్తున్నట్లు సాయంత్రం 6 గంటలకు ఆర్వో ప్రకటించారు. అప్పటికీ, ఆస్తుల వివరాలతో కూడిన అనుబంధ పత్రాలను ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. దీనిపై కోట్ల తరఫు న్యాయవాదులు సంతృప్తి చెందలేదు. అధికారులు అసంబద్ధ కారణాలతో సమర్థించుకుంటున్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

వైకాపా కార్యకర్తల రాకతో ఉద్రిక్తత

అధికారుల సూచన మేరకు తెదేపా న్యాయవాదులు సాయంత్రం ఐదింటికి ఆర్వో కార్యాలయానికి వెళ్లగా, అప్పటికే సుమారు 40 మంది వైకాపా నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతమంది ఎందుకు వచ్చారంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉల్టా తెదేపా న్యాయవాదులనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ‘మేం అధికారులు పిలిస్తే వచ్చాం. కానీ, వైకాపా కార్యకర్తలు అనుమతి లేకుండా వచ్చి, మమ్మల్ని బెదిరిస్తున్నారు. వారిని అనుమతించి మాపై జులుం ప్రదర్శించడమేంట’ని తెదేపా న్యాయవాదులు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img