icon icon icon
icon icon icon

ముగిసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. వైకాపా అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్లు, నామినేషన్‌ పత్రాలపై తెదేపా అభ్యర్థులు పలు అభ్యంతరాలు తెలిపారు.

Published : 27 Apr 2024 05:53 IST

వైకాపా అభ్యర్థులు సమర్పించిన  వివరాలపై తెదేపా అభ్యంతరాలు

ఈనాడు, అమరావతి, యంత్రాంగం: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. వైకాపా అభ్యర్థులు దాఖలుచేసిన అఫిడవిట్లు, నామినేషన్‌ పత్రాలపై తెదేపా అభ్యర్థులు పలు అభ్యంతరాలు తెలిపారు.

చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌పై నిర్ణయం పెండింగ్‌

చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ పత్రంపై నిర్ణయాన్ని రిటర్నింగ్‌ అధికారి జి.సూర్యనారాయణరెడ్డి పెండింగ్‌లో పెట్టారు. కృష్ణమోహన్‌ రూ.4.63 కోట్ల మేర విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ఆర్వోకు ఫిర్యాదు అందడంతో దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. శనివారం ఉదయానికల్లా విద్యుత్తు బిల్లుల చెల్లింపుల పూర్తి  వివరాలు, పత్రాలు సమర్పించాలని ఆమంచిని ఆర్వో ఆదేశించారు.

లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వడంతో అదీప్‌రాజ్‌ నామినేషన్‌ ఆమోదం

పెందుర్తి వైకాపా అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌.. అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల జాబితాలో తేదీలు పొందుపరచలేదని, చాలాచోట్ల టిక్‌ మార్కులు లేవని జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు ఫిర్యాదుచేశారు. వీటిపై లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని అదీప్‌రాజ్‌ను ఆర్వో ఆదేశించారు. ఆయన వెంటనే సంజాయిషీ ఇవ్వడంతో నామినేషన్‌ ఆమోదించారు.

ఎంవీవీ సత్యనారాయణ కేసుల వివరాల్లేవు.. విద్యార్హతలు నమ్మశక్యంగా లేవు

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామినేషన్‌ పత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉందని, దాన్ని తిరస్కరించాలని తెదేపా అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదుచేశారు. అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు పూర్తిగా పొందుపరచలేదని అభ్యంతరం తెలిపారు. ‘‘ఎంవీవీ సత్యనారాయణ... 2019 ఎన్నికల్లో దాఖలుచేసిన అఫిడవిట్‌లో తన విద్యార్హత పదోతరగతిగా పేర్కొన్నారు. తాజా అఫిడవిట్‌ మాత్రం పీజీ పూర్తిచేసి, పీహెచ్‌డీ చేస్తున్నట్లు ప్రస్తావించారు. అది నమ్మశక్యంగా లేదు’’ అని రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. అవన్నీ చిన్నవేనంటూ ఆర్వో కె.మయూర్‌ అశోక్‌ ఎంవీవీ నామినేషన్‌ను ఆమోదించారు.

దువ్వాడ శ్రీనివాస్‌.. ఒడిశాలోని కేసులు, విద్యార్హతలు ప్రస్తావించలేదు

టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌.. అఫిడవిట్‌లో తనపై ఒడిశాలో ఉన్న కేసుల వివరాలు పొందుపరచలేదని, ఆయన విద్యార్హతల వివరాలు సరిగ్గా లేవని స్వతంత్ర అభ్యర్థి లోతుగడ్డ రాము ఫిర్యాదు చేశారు. అదే అభ్యర్థి దాఖలు చేసిన వేర్వేరు సెట్లలో వేర్వేరుచోట్ల ఆ వివరాలు సక్రమంగానే ఉన్నాయంటూ ఆర్వో దువ్వాడ నామినేషన్‌ను ఆమోదించారు.

కోర్టును ఆశ్రయించాలంటూ.. ఆమోదం

నర్సీపట్నం వైకాపా అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అఫిడవిట్‌లో ఆదాయపన్ను వివరాలు లేవని తెదేపా అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదుచేశారు. ఆయన పన్ను ఎగవేసినందున నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. ఆస్తులు, అప్పులు, ఆదాయపన్ను తదితర అంశాలపై అభ్యంతరాలుంటే ఎన్నికల తర్వాత కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ ఆర్వో జయరామ్‌ ఆయన నామినేషన్‌ను ఆమోదించారు.

అలజంగి జోగారావు ఆస్తుల వివరాల్లేవు

పార్వతీపురం వైకాపా అభ్యర్థి అలజంగి జోగారావుకు మూడుచోట్ల వేర్వేరు ఓటరు గుర్తింపుసంఖ్యతో ఓట్లు ఉన్నాయని తెదేపా అభ్యర్థి బి.విజయచంద్ర ఫిర్యాదు చేశారు. జోగారావు పేరిట ఉన్న స్థిరాస్తులను అఫిడవిట్‌లో చూపించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల వినియోగం, రుసుము చెల్లింపుపై ఒకచోట అవునని, మరోచోట కాదని అఫిడవిట్‌లో పొందుపరిచారని.. ఆయన నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. కానీ ఆర్వో చివరకు నామినేషన్‌ను ఆమోదించారు. వీటిపై న్యాయపోరాటం చేస్తామని తెదేపా అభ్యర్థి విజయచంద్ర వెల్లడించారు.

తమ్మినేని సీతారామ్‌ అప్పుడు డిగ్రీ చదివినట్లు.. ఇప్పుడు లేనట్టు

  • ఆమదాలవలస వైకాపా అభ్యర్థి తమ్మినేని సీతారామ్‌ విద్యార్హతలపై స్వతంత్ర అభ్యర్థి సువ్వారి గాంధీ అభ్యంతరం తెలిపారు. 2019 ఎన్నికల్లో తనకు డిగ్రీ ఉందని సీతారామ్‌ చూపించారని, ఇప్పుడు మాత్రం డిగ్రీ చూపలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీతారామ్‌ భార్య పేరిట ఉన్న కంపెనీలు, ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో చూపించలేదన్నారు. వాటిపై విచారణ జరిపిన ఆర్వో చివరికి నామినేషన్‌ను ఆమోదించారు.
  • ఇచ్ఛాపురం వైకాపా అభ్యర్థి పిరియా విజయ ఫాం-26లో ప్రభుత్వ వసతికి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ దాఖలు చేయలేదంటూ ఫిర్యాదు అందినా ఆమె నామినేషన్‌ ఆమోదించారు.
  • శింగనమల వైకాపా అభ్యర్థి వీరాంజనేయులు భార్య ప్రమీల రాష్ట్ర నాటక అకాడమీ ఛైర్మన్‌ పదవిలో ఉన్నారు. ప్రభుత్వం ద్వారా ఆమెకు వచ్చే ఆదాయాన్ని అఫిడవిట్‌లో చూపించలేదని తెదేపా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఆర్వో.. చివరికి నామినేషన్‌ ఆమోదించారు.
  • తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ ఫాం-26లో నోటరీ సంతకం, అభ్యర్థి సంతకం వేర్వేరు తేదీలతో ఉన్నాయని, ఆ నామినేషన్‌ తిరస్కరించాలని తెదేపా ఫిర్యాదు చేసింది.
  • రాజంపేట లోక్‌సభ వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి నో డ్యూస్‌ సర్టిఫికెట్‌ తేలేదని, ఆయన నామినేషన్‌ తిరస్కరించాలని తెదేపా ఫిర్యాదు చేసింది.
  • గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ అఫిడవిట్‌లో ఆయన భార్య, కుమార్తె పేర్లు ఉన్నా.. ఆస్తుల వివరాలు పొందుపరచలేదని తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అభ్యంతరం తెలిపారు. ఇంకా పలు అభ్యంతరాలు తెలిపినా, నామినేషన్‌ను ఆర్వో ఆమోదించడంతో.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
  • బాపట్ల వైకాపా అభ్యర్థి కోన రఘుపతి ఇల్లు ఎసైన్డ్‌ భూమిలో కట్టారని, ఆయన నామినేషన్‌ తిరస్కరించాలని జైభీమ్‌ భారత్‌పార్టీ లోక్‌సభ అభ్యర్థి పర్రె కోటయ్య ఫిర్యాదుచేశారు. కానీ, అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలని సూచించి, నామినేషన్‌ను ఆర్వో ఆమోదించారు.
  • వినుకొండ వైకాపా అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విద్యార్హతలపై జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయక్‌ అభ్యంతరం తెలిపారు. 2009, 2014లో డిగ్రీ చదివినట్లు పేర్కొన్న ఆయన.. 2019, 2024లో చదువుకోలేదని తప్పుడు సమాచారం ఇచ్చినందున నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. ఆర్వో ఈ అభ్యంతరాలను తిరస్కరించి నామినేషన్‌ ఆమోదించారు.

వైకాపా కుట్ర భగ్నం

నందిగామ తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య పేరు కలిగిన విజయవాడకు చెందిన ఓ మహిళతో స్వతంత్ర అభ్యర్థిగా వైకాపా నాయకులు వేయించిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. తెదేపా అభ్యర్థి ఓట్లకు గండి కొట్టాలనుకున్న వైకాపా నాయకుల కుట్ర దీంతో భగ్నమైంది.

సాయిరెడ్డి అభ్యంతరం తోసిరాజని..

నెల్లూరు లోక్‌సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌పై వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి పలు అభ్యంతరాలు తెలిపారు. ఆస్తులన్నీ చూపలేదని, అందువల్ల తిరస్కరించాలని కోరారు. అనంతరం నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ చేరుకుని వివరణ ఇవ్వడంతో కలెక్టర్‌ హరినారాయణన్‌ విజయసాయిరెడ్డి అభ్యంతరాలను తోసిపుచ్చి వేమిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img