icon icon icon
icon icon icon

డ్వాక్రా మహిళలకు ధోకా

డ్వాక్రా రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తేశారు. గత ఎన్నికల ముందు నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పేరుతో డ్వాక్రా రుణమాఫీ పథకం ప్రకటించి గత ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు చెల్లించారు.

Published : 28 Apr 2024 05:16 IST

వైకాపా మ్యానిఫెస్టోలో కనిపించని రుణమాఫీ ప్రకటన
సున్నావడ్డీ రాయితీ పరిమితినీ పెంచలేదు

ఈనాడు, అమరావతి: డ్వాక్రా రుణమాఫీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఎత్తేశారు. గత ఎన్నికల ముందు నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పేరుతో డ్వాక్రా రుణమాఫీ పథకం ప్రకటించి గత ఐదేళ్లలో నాలుగు విడతల్లో రూ.25,571 కోట్లు చెల్లించారు. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ మళ్లీ అమలుచేస్తామని చెప్పలేదు. అంటే గతంలో ప్రకటించిన నవరత్నాల్లో ఆసరా రత్నం రాలిపోయినట్టే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.10 కోట్ల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. వారందరికీ ఇది అశనిపాతమే.

ఊదరగొట్టిన వైకాపా నేతలు

డ్వాక్రా రుణమాఫీ చివరి విడత నిధుల విడుదలకు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మండలాలు, పురపాలక సంఘాల వారీగా డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటిలో పాల్గొని రుణమాఫీపై విస్తృత ప్రచారం చేశారు. మళ్లీ డ్వాక్రా రుణమాఫీ చేయబోతున్నామని హామీ కూడా చాలాచోట్ల ఇచ్చారు. పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవాలని డ్వాక్రా మహిళల్ని ప్రోత్సహించారు. తీరా మ్యానిఫెస్టోలో చేతులెత్తేశారు.

సున్నావడ్డీ రాయితీ పరిమితి యథాతథం

2019కి ముందు తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణానికి రూ.5లక్షల వరకు సున్నావడ్డీ రాయితీని అమలు చేసింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని రూ.3లక్షలకు కుదించారు. మహిళలకు మేలుచేయాలన్న ఆలోచనే ఉంటే తెదేపా రూ.7 లక్షలకో.. ఇంకా ఎక్కువకో పెంచాలి. కానీ రూ.2లక్షలు తగ్గించి రూ.3లక్షలకే సున్నావడ్డీ రాయితీని పరిమితం చేశారు. ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా రాయితీ పరిమితిని పెంచాలని అనిపించలేదు. ఇప్పుడు మ్యానిఫెస్టోలో అదే రూ.3లక్షల వరకే రాయితీని వర్తింపజేస్తానని ప్రకటించడం డ్వాక్రా మహిళల్ని విస్మయానికి గురిచేసింది.

మహిళల నెత్తిన రూ.90వేల కోట్ల అప్పుల కుప్ప

గత ఎన్నికల ముందు పాదయాత్రలో డ్వాక్రా మహిళలపై రూ.25వేల కోట్ల అప్పు ఉన్నట్టు ప్రచారం చేశారు. దీనికి అప్పటి తెదేపా ప్రభుత్వమే కారణమని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళల నెత్తిన రూ.90వేల కోట్ల అప్పు పెట్టారు. వైకాపా నేతల మాటలతో రుణమాఫీ హామీ వస్తుందని మహిళలు ఆశించారు. వారందరికీ హ్యాండ్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img