icon icon icon
icon icon icon

ఒక్కసారీ ఓటు వేయలేదు..!

ఒక్క ఓటరున్నా సిబ్బంది అక్కడికే వెళ్లి ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ మన దేశంలో ఉంది. ఓటుకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఓటర్లలో చైతన్యం తీసుకురాలేకపోతోంది.

Published : 28 Apr 2024 06:42 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: ఒక్క ఓటరున్నా సిబ్బంది అక్కడికే వెళ్లి ఎన్నికలు నిర్వహించే వ్యవస్థ మన దేశంలో ఉంది. ఓటుకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ఓటర్లలో చైతన్యం తీసుకురాలేకపోతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం జి.కొత్తపాలెం గిరిజనులు ఇప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఈ గ్రామంలో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 50 మందికి ఓటరుగా అర్హత ఉంది. వీరిలో నలుగురికే ఓటుహక్కు ఉంది. వారికి ఓటుహక్కు వచ్చి దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ఈ గ్రామం మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి రాకపోకలు సాగించాలంటే కొండలు, వాగులు దాటాలి. ఆ నలుగురికి సంబంధించిన పోలింగ్‌ కేంద్రం 11 కిలోమీటర్ల దూరంలో ఉండటం, రహదారి సౌకర్యం లేకపోవడం (తాజాగా కొంతవరకు రోడ్డు వేశారు)తో గతంలో జరిగిన ఎన్నికల్లో వీరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. సచివాలయాలు, వాలంటీరు వ్యవస్థ తీసుకొచ్చినా ఈ గ్రామస్థులకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందించలేకపోయారు. తమకు ఓటు ఎక్కడ, ఎప్పుడు వేయాలని ఎవరూ చెప్పలేదని.. అందుకే ఓటు హక్కు ఉన్నా వేయలేకపోయామని గిరిజనులు అమాయకంగా చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img