icon icon icon
icon icon icon

పుంగనూరు నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడి

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. చౌడేపల్లె మండల తెదేపా అధ్యక్షుడు గువ్వల రమేశ్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు నిలువరించడానికి యత్నించిన తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు.

Published : 29 Apr 2024 03:48 IST

చౌడేపల్లె మండల తెదేపా అధ్యక్షుడి కారు ధ్వంసం

చౌడేపల్లె, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. చౌడేపల్లె మండల తెదేపా అధ్యక్షుడు గువ్వల రమేశ్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడంతోపాటు నిలువరించడానికి యత్నించిన తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా దీటుగా స్పందించడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివరాలు ఇలా ఉన్నాయి. తెదేపా మండల అధ్యక్షుడు గువ్వల రమేశ్‌రెడ్డి శనివారం రాత్రి బోయకొండ ఆలయం దిగువన తెదేపా కార్యకర్త జన్మదిన వేడుకలు నిర్వహించి అనుచరులతో కలిసి ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో బోయకొండ క్రాస్‌ వద్ద వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టేలా జెండాలు ఏర్పాటు చేశారు. తెదేపా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో రమేశ్‌రెడ్డి కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు సైతం ప్రతిగా రాళ్లు రువ్వారు. ఎక్కడైనా తిరిగే హక్కు తమకు ఉందని బదులిచ్చారు. ఈ ఘటనలో తెదేపా కార్యకర్తలు ఆదిశేషు, గణపతి, సునీల్‌కుమార్‌కు గాయాలయ్యాయి. వైకాపా కార్యకర్తలు ఇద్దరికి దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనూ అదుపులోకి తీసుకొని వారిపై కేసులు పెట్టారు. ఇరు పార్టీలపై ఏయే సెక్షన్ల కింద, ఎవరెవరిపై కేసులు నమోదు చేశారో చెప్పాలని అడిగితే వారు స్పందించలేదు. ఉన్నతాధికారులు వెల్లడిస్తారని మాత్రమే పేర్కొన్నారు. రమేశ్‌రెడ్డితోపాటు మరికొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సమాచారం. వైకాపా నాయకులపైనా కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.

గతంలోనే రౌడీషీట్‌ తెరిచి కక్ష సాధింపు

సార్వత్రిక ఎన్నికలకు రెండు వారాలు మాత్రమే ఉన్న ఈ తరుణంలో నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద జైలుకు పంపి తెదేపా శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే పోలీసుల వ్యూహంగా కనిపిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వారు ఇలా వ్యవహరించారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతేడాది ఆగస్టు 4న పుంగనూరు మండలం భీమగానిపల్లె కూడలి వద్ద జరిగిన అల్లర్ల కేసుల్లో సైతం రమేశ్‌రెడ్డిని నిందితుడిగా చూపుతూ కారాగారానికి పంపించారు. అనంతరం రౌడీషీట్‌ నమోదు చేశారు. అయినప్పటికీ ఆయన క్రియాశీలకంగా ఉండటాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోయారు. మండలంలోని వైకాపా నాయకుడు జరుపుతున్న అక్రమ మట్టి తవ్వకాలను మార్చి 21న రమేశ్‌రెడ్డి ప్రశ్నించినందుకు ఆయన్ను పోలీసులు స్టేషన్‌కు తరలించి ఆయనపైనే కేసు పెట్టడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img