icon icon icon
icon icon icon

ఒక్క ముస్లింకూ అన్యాయం చేయం

‘హైదరాబాద్‌లో ముస్లింలు నేడు దేశంలోనే అందరి కంటే బాగున్నారంటే అందుకు తెదేపానే కారణం. ఎప్పుడు ఎన్డీయేలో ఉన్నా.. ఏ ఒక్క ముస్లింకూ అన్యాయం చేయలేదు. ఇకపైనా చేయం.

Published : 29 Apr 2024 05:49 IST

హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం
నెల్లూరులో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, నెల్లూరు: ‘హైదరాబాద్‌లో ముస్లింలు నేడు దేశంలోనే అందరి కంటే బాగున్నారంటే అందుకు తెదేపానే కారణం. ఎప్పుడు ఎన్డీయేలో ఉన్నా.. ఏ ఒక్క ముస్లింకూ అన్యాయం చేయలేదు. ఇకపైనా చేయం. అప్పటి ప్రధాని వాజ్‌పేయి సహకారంతో హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విభజన తర్వాత కడప, విజయవాడలోనూ హజ్‌ హౌస్‌లు కట్టించాం. ప్రస్తుతం మనం సమావేశం ఏర్పాటు చేసుకున్న షాదీ మంజిల్‌ను రూ.8 కోట్లతో మూడంతస్తుల్లో నిర్మించాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. ఆదివారం నెల్లూరులోని కోటమిట్ట షాదీ మంజిల్‌లో ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అయిదేళ్ల పాలనలో ముస్లింల కోసం జగన్‌రెడ్డి ఒక్కటైనా ఇలాంటి భవనం కట్టించారా? పార్లమెంట్‌లో సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులు పెట్టినప్పుడు కేంద్రానికి మద్దతు తెలిపారు. వాళ్ల ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుకు మద్దతుగా సంతకం కూడా పెట్టారు. ఇప్పుడు ముస్లింలకు తెదేపా అన్యాయం చేస్తోందని, మా కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తారని జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘మా ప్రభుత్వంలో దుల్హన్‌ పథకం అమలు చేశాం. ఉర్దూను రెండో భాషగా చేశాం. రంజాన్‌ తోఫా, విదేశీ విద్యను అందించాం. దర్గాలు, మసీదులు, ఈద్గాల మరమ్మతులకు నిధులు, ఇమాం, మౌజన్‌లకు గౌరవవేతనం ఇచ్చాం’ అని చంద్రబాబు వివరించారు.

వైకాపా ప్రభుత్వంలో దాడులు

‘వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు పెరిగాయి. నంద్యాలలో అబ్దుల్‌ సలాం అనే వ్యక్తిని దొంగగా చిత్రీకరించి ఆయన కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునేలా అవమానించారు. మిస్బా అనే విద్యార్థినిని వేధించడంతో బలవన్మరణం పాలయ్యారు. నరసరావుపేటలో వక్ఫ్‌ బోర్డు స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమిస్తే అడ్డుకున్నందుకు చంపేశారు. మాచర్లలో 100 ముస్లిం కుటుంబాలను బహిష్కరించారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ అంశం సుప్రీంకోర్టులో ఉందని, మంచి లాయర్లను పెట్టి వాదనలు వినిపించాలన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img