icon icon icon
icon icon icon

తెదేపాకు మద్దతిస్తే చంపేస్తాం

అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుల దౌర్జన్యాలు, దాడులు మితిమీరుతున్నాయి. దళితులు, బీసీలపై దాడులు చేస్తూ భయభ్రాంతులను చేస్తున్నారు.

Published : 29 Apr 2024 05:50 IST

తోపుదుర్తిలో ఎమ్మెల్యే సోదరుడు, అనుచరుల దౌర్జన్యకాండ
తెదేపా బీసీ, ఎస్సీ కార్యకర్తలపై అర్ధరాత్రి దాడి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుల దౌర్జన్యాలు, దాడులు మితిమీరుతున్నాయి. దళితులు, బీసీలపై దాడులు చేస్తూ భయభ్రాంతులను చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి చెందిన సంపత్‌పై దాడి జరిగిన మరుసటి రోజే ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన బోయ సామాజికవర్గానికి చెందిన లింగమయ్య, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వన్నూరప్పపై ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖరరెడ్డి అనుచరులు శనివారం అర్ధరాత్రి దాడులకు దిగారు. మొదట లింగమయ్య ఇంటి వద్దకు వెళ్లి తెదేపాకు మద్దతివ్వరాదని ఒత్తిడి తెచ్చారు. గ్రామంలో ఉంటూ తెదేపాకు మద్దతిస్తే చంపేస్తామంటూ విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న వాల్మీకి సామాజికవర్గం తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున లింగమయ్య ఇంటి వద్దకు చేరుకొని వాగ్వాదానికి దిగడంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వన్నూరప్ప ఇంటి వద్దకు వెళ్లారు. రాత్రిపూట ఆరుబయట వన్నూరప్ప కుటుంబీకులు నిద్రిస్తుండగా చుట్టుముట్టారు. రాజశేఖరరెడ్డి పిలుస్తున్నారని.. వెంట రావాలని చెప్పారు. తాను రానని వన్నూరప్ప సమాధానమివ్వడంతో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు దాడి చేస్తూ దుర్భాషలాడారు. దుస్తులను చించివేస్తూ బలవంతంగా రాజశేఖరరెడ్డి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. ఎన్నికలయ్యే వరకు ఎక్కడ తిరుగుతావో చూస్తామని, తిరిగితే చంపేస్తామని రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. తనకు తోపుదుర్తి కుటుంబీకుల నుంచి ప్రాణహాని ఉందని మీడియా ఎదుట వన్నూరప్ప వాపోయారు. గత ఎన్నికల్లోనూ ఇలానే బెదిరించినప్పటికీ గ్రామంలోని తెదేపా నాయకులు ఎవరూ వెనకడుగు వేయలేదు. సర్పంచి ఎన్నికల్లో తెదేపా నాయకులు ఉదయాన్నే ఓటేసి గ్రామంలో ఉంటే తమపై అక్రమ కేసులు పెడతారన్న భయంతో ముందుగానే పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. శనివారం అర్ధరాత్రి తమపై దాడి జరుగుతున్నప్పుడు పోలీసు సిబ్బంది గ్రామంలో బందోబస్తులో ఉన్నప్పటికీ అండగా రాలేదని బాధితులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img