icon icon icon
icon icon icon

జగన్‌ది హత్యా రాజకీయం.. నాది అభివృద్ధి రాజకీయం

‘నేను ఈ సైకోను చంపాలని ప్రయత్నిస్తున్నానని జగన్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రచారం చేస్తున్నారు.. గొడ్డలితో వివేకాను హత్య చేయించింది ఎవరు.. కోడి కత్తి డ్రామా ఆడింది ఎవరు.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నది ఎవరు.. ఈ సైకో జగన్‌ కాదా! సొంత బాబాయ్‌ని చంపించి ఆయన కూతురు పైకే నేరం నెడుతున్నారు.

Published : 01 May 2024 04:21 IST

బాధితులనే నిందితులుగా చేస్తారు
ప్రజల ఆస్తులను మింగే నల్లచట్టం తెస్తున్నారు
దెందులూరు, తెనాలి సభల్లో చంద్రబాబు

ఈనాడు, ఏలూరు: ‘నేను ఈ సైకోను చంపాలని ప్రయత్నిస్తున్నానని జగన్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రచారం చేస్తున్నారు.. గొడ్డలితో వివేకాను హత్య చేయించింది ఎవరు.. కోడి కత్తి డ్రామా ఆడింది ఎవరు.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నది ఎవరు.. ఈ సైకో జగన్‌ కాదా! సొంత బాబాయ్‌ని చంపించి ఆయన కూతురు పైకే నేరం నెడుతున్నారు. హత్యా రాజకీయాలు చేస్తోంది ఎవరో మీరే చెప్పండి. జగన్‌ది హత్యా రాజకీయం.. నాది అభివృద్ధి రాజకీయం.. ఈ రెండింటిలో ఏం కావాలో మీరే నిర్ణయించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో మంగళవారం ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘తప్పుడు కేసులు బనాయించినా.. అన్యాయంగా జైల్లో పెట్టినా నేను వెన్ను చూపలేదు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టను. 2047 నాటికి ప్రపంచంలో తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలన్నది నా ఆకాంక్ష. జగన్‌ పాలనలో జె బ్రాండ్‌ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలలో చెలగాటం ఆడుతున్నారు’ అని విమర్శించారు. ఆన్‌లైన్‌లో మీ రికార్డులు మార్చి మీ తలరాత మార్చేస్తారు. జగన్‌ నల్లచట్టం తీసుకొస్తున్నారు. అది అమల్లోకి వస్తే మీ ఆస్తులకు జగన్‌ యజమాని అయిపోతారు’ అని చంద్రబాబు అన్నారు.

జగన్‌ భార్యకూ పరాభవమే

‘జగన్‌ తరఫున సొంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఆయన భార్యకూ పరాభవం తప్పలేదు ‘మా తాతల కాలం నుంచి వారసత్వంగా ఇచ్చిన ఆస్తి పత్రాలపై మీ ఆయన ఫొటో ఎందుకు. ఇది న్యాయమా’ అని వైకాపా నాయకుడే ప్రశ్నించారు. ఇంతకు మించిన తిరుగుబాటు ఇంకేముంది? అయిదేళ్ల ఆశలను, ఆశయాలను నెరవేర్చేందుకు ఏర్పాటు చేసుకున్న కట్టుబాటే ఎన్నికల మ్యానిఫెస్టో. మేం ప్రకటించిన మ్యానిఫెస్టో అదిరిపోయింది. దీని ముందు సైకో మ్యానిఫెస్టో అడ్రస్‌ లేకుండా పోయింది’ అని చంద్రబాబు అన్నారు.

పోలవరాన్ని గోదాట్లో కలిపేశారు

28 సార్లు పోలవరాన్ని సందర్శించి అభివృద్ధిని పరుగులు పెట్టించా. 72 శాతం నిర్మాణం పూర్తి చేశా. వైకాపా పాలనలో పోలవరాన్ని నాశనం చేసి గోదాట్లో కలిపేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని సీఎం ఒక పాలకుడా..పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిస్తాం’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ‘దెందులూరు ఎమ్మెల్యే అక్రమాలతో దెందులూరును దందాలూరుగా మార్చారు. తండ్రీ కొడుకులిద్దరూ వసూళ్ల దందా చేస్తున్నారు. రైతులకు గోనె సంచులివ్వలేని మంత్రి కొడుకు ఇక్కడ పోటీ చేస్తున్నారు.. ఆయనను ‘ఎర్రిపప్ప’ను చేసి ఇంటికి పంపించాలి’ అని చంద్రబాబు అన్నారు.


ముస్లింల రక్షణ, సంక్షేమం బాధ్యత మాది

ఈనాడు, అమరావతి: తెనాలిలో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయం అని వైకాపాకు ఓటేసి జీవితాలను మళ్లీ నాశనం చేసుకోవద్దని సూచించారు.‘రంజాన్‌ కానుకలు ఆపేసి ముస్లింల పొట్ట కొట్టిన వ్యక్తి జగన్‌. ఆయన మైనార్టీల శ్రేయోభిలాషి ఎలా అవుతారు? మేము రంజాన్‌ తోఫా అందించాం. దుల్హన్‌ ద్వారా రూ.50 వేలు ఇచ్చాం. 36 వేల నిరుపేద ముస్లిం యువతులకు పెళ్లిళ్లు చేశాం. ఇవన్నీ జగన్‌ అమలు చేశారా? ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ కోసం పోరాడాం. షాదీఖానాలు కట్టించాం. ఇమామ్‌లకు ఆర్థిక సాయం అందించాం, ఉర్దూ రెండో భాషగా చేశాం. ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. మేము వస్తే మసీదులు కూలుస్తాం అంటున్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. మేము రద్దు చేయం. కాపాడతాం. మసీదులు నిర్మిస్తాం. సీఏఏ, ఎన్‌ఆర్సీ విషయంలో పార్లమెంటులో ఎవరు మద్దతు ఇచ్చారు? చీకటి ఒప్పందం మీది. ఏదైనా సరే చెప్పే ధైర్యం మాది. ఎందుకు కలిశామో ప్రజలకు చెప్పే చేస్తున్నాం. ప్రజల కోసం రాష్ట్రం కోసం కలిశాం. కేంద్రం సహకరించకపోతే నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుందని కలిశాం. సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉన్నా మ్యానిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్‌ ఇచ్చాం. మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు వాటా ఇవ్వాలి. దుకాణాలన్నీ రాయించుకుని మీ దుకాణాల్లో మీతో కూలీ పని చేయిస్తారు’ అని పేర్కొన్నారు.

‘అవినాష్‌రెడ్డి చిన్న పిల్లాడా? బాబాయ్‌ను లేపేసిన వ్యక్తి అమాయకుడా? ఇలాంటి సైకోకు వ్యతిరేకంగా తిరగబడాలి. ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందని ఊరుకోవద్దు. ఓటేయకుంటే వాళ్ల గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. ఈ రౌడీలు మన ఇంటిని ఆక్రమిస్తారు. గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోతే రక్షించేవారు ఉండరు. తెనాలి ఎమ్మెల్యే జగనన్న కాలనీలకు ఇచ్చే ఇళ్ల స్థలాల భూసేకరణలో రూ. 80 కోట్లు దోచేశారు’ అని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img