icon icon icon
icon icon icon

సంక్షిప్త వార్తలు (5)

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థులు పోటీలో ఉన్న ధర్మవరం, కైకలూరు, ఆదోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.

Updated : 01 May 2024 07:03 IST

భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా పర్యటన రేపు

ఈనాడు, అమరావతి: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. భాజపా అభ్యర్థులు పోటీలో ఉన్న ధర్మవరం, కైకలూరు, ఆదోని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నడ్డా ఈ మూడుచోట్ల పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఈ నెల 4 నుంచి, తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై 9, 10, 11వ తేదీల్లో మంగళగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.


విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‌షోకు ట్రయల్‌ రన్‌

విజయవాడ నగరంలోని బెంజ్‌సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్‌ డిపో వద్ద ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ వరకు ప్రధాని మోదీ రోడ్‌ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ట్రయల్‌ రన్‌ జరిగింది. మోదీ ఈ నెల 7, 8 లేదా 8, 9వ తేదీల్లో రాష్ట్ర పర్యటనకు రానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రచారం ముగింపు రోజు రాష్ట్రంలో మూడు సభల్లో పాల్గొనే అవకాశాలున్నాయి.


కూటమి ఎన్నికల ప్రణాళికలో బ్రాహ్మణులకు ప్రాధాన్యం
తెదేపా నేత నీలాయపాలెం విజయ్‌కుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహ ధ్వంసం, అంతర్వేదిలో రథం దహనం ఘటనలపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్న ఎన్డీఏ మ్యానిఫెస్టో.. హిందువులకు ఊరట కలిగిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఎన్డీయే మ్యానిఫెస్టోలో బ్రాహ్మణ కార్పొరేషన్‌తో పాటు కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలను తగినన్ని నిధులతో పునరుద్ధరిస్తామనడం ప్రశంసనీయం. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీసం వేతనం, రూ.50 వేల ఆదాయం వచ్చే ఆలయాల్లోని అర్చకులకు నెలకు రూ.15 వేలు, అంతకంటే తక్కువ ఆదాయం గల ఆలయాల్లోని అర్చకులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వడం అభినందనీయం’ అని విజయ్‌కుమార్‌ తెలిపారు.


ఆలయాలపై దాడులు చేసి... అభివృద్ధి చేస్తామంటారా?: సుధీష్‌ రాంబొట్ల

ఈనాడు, అమరావతి: గత ఐదేళ్లలో వైకాపా రాక్షస పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సుధీష్‌ రాంబొట్ల విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా దోచుకొని..దాచుకోవటమే సిద్ధాంతంగా వైకాపా పనిచేసిందన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం మాట్లాడుతూ వైకాపా పాలనలో హిందూ దేవాలయాలు, సంస్థలపై దాడులు ఎక్కువగా జరిగాయని పేర్కొన్నారు. వీటి గురించి ఏమీ తెలియనట్లు మ్యానిఫెస్టోలో హిందూ దేవాలయాల అభివృద్ధి చేస్తామని వైకాపా పేర్కొనడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. వివాహ వేడుకలో పండితుడి పై దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.


ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: నారాయణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌ పదేళ్లుగా బెయిల్‌పై ఉంటారా? ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకొని ఆ రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ అన్నారు.మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌ను జైలులో పెట్టేందుకు మోదీ అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img