icon icon icon
icon icon icon

కేంద్రం పేరు వాడుకుంటూ వైకాపా భూ దోపిడీ

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో వైకాపా ప్రభుత్వం భారీ భూ దోపిడీకి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ధ్వజమెత్తారు.

Published : 02 May 2024 05:51 IST

లోపభూయిష్ఠంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌
భాజపా నేత యామినీశర్మ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో వైకాపా ప్రభుత్వం భారీ భూ దోపిడీకి పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ధ్వజమెత్తారు. ఇందుకు జగన్‌ సర్కారు కేంద్రం పేరు వాడుతోందని మండిపడ్డారు. ఈ చట్టం విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలను తుంగలో తొక్కి తమకు అనుకూలంగా ఈ చట్టంలో మార్పులు చేశారని విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఈ చట్టం ఇప్పటికే ఉన్న భూ వివాదాలకు పరిష్కారం చూపకపోగా, మరింత క్లిష్టంగా మార్చనుంది. రికార్డు ఆఫ్‌ టైటిల్స్‌లో ఓసారి యజమాని పేరు నమోదు చేశాక, దానికి రెండేళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే ఆ యజమానే హక్కుదారు అవుతారంటూ పలు కఠిన అంశాలను ఇందులో పొందుపరిచారు. ఎవరి పేరునో రికార్డుల్లో చేర్చిన విషయం రైతులు, నిరక్షరాస్యులకు ఎలా తెలుస్తుంది? భూ వివాదాల పరిష్కారం కోర్టుల్లో జాప్యం జరుగుతుందనే నెపంతో ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వైకాపా సర్కారు సాకులు చెబుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. అంతేగానీ.. న్యాయశాస్త్రాలపై కనీస పరిజ్ఞానం లేని అధికారులు భూ యాజమాన్య హక్కులను ఎలా నిర్ణయిస్తారు’ అని ఆమె నిలదీశారు. ‘ఈ చట్టం ద్వారా సామాన్యుడి ఆస్తి రక్షణ హక్కును వైకాపా సర్కారు బలవంతంగా లాక్కుంటోంది. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలంటే సంబంధిత బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్‌ ప్రకారం అందుకు తగిన ఉత్తర్వులుండాలి. కానీ.. ఈ చట్టం ప్రకారం ఆ ఉత్తర్వులేవీ లేకుండానే అధికారులు తమ ఇష్టానుసారం మార్చే వెసులు బాటు కల్పించారు. ఏదైనా కొత్త చట్టాన్ని అమలు చేస్తే.. అది ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. ఈ చట్టం సామాన్యులకు కీడు చేసేలా ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలకు అవరోధంగా మారేలా ఉంది. దీనివల్ల ప్రధానంగా నిరక్షరాస్యులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారు. తమ ఆస్తులకు తామే యజమానులమని నిరూపించుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాల్సిన దుస్థితి ఎదురయ్యే ప్రమాదముంది’ అని యామినీశర్మ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img