icon icon icon
icon icon icon

గతంలో ఎవరూ చేయని పాలన చేసి చూపా

‘మీ భూములను వంద సంవత్సరాల క్రితం బ్రిటిషర్ల పాలనలో సర్వే చేశారు. దాని తర్వాత సర్వే చేసిన పరిస్థితుల్లేవు.

Updated : 02 May 2024 06:36 IST

మాపై దుష్ప్రచారాలు మానుకోవాలి
పాయకరావుపేట సభలో సీఎం జగన్‌

ఈనాడు, అనకాపల్లి, విజయనగరం, ఏలూరు, న్యూస్‌టుడే, పాయకరావుపేట: ‘మీ భూములను వంద సంవత్సరాల క్రితం బ్రిటిషర్ల పాలనలో సర్వే చేశారు. దాని తర్వాత సర్వే చేసిన పరిస్థితుల్లేవు. భూముల సబ్‌ డివిజన్లు జరగక, కొలతలన్నీ సరిగ్గా లేక అమ్ముకునేందుకు, కొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్లకు డబ్బులు ఇచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి మార్చాలని మొదటిసారిగా రీసర్వే చేయించాం. రికార్డులన్నీ అప్‌డేట్ చేసి ఆ పత్రాలన్నీ రిజిస్ట్రేషన్లు చేసి రైతన్నలకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు తెలపాలిగానీ దానిమీద లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం గురించి చంద్రబాబుకు తెలుసా’ అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, విజయనగరం జిల్లా బొబ్బిలి, ఏలూరులో బుధవారం జరిగిన సభల్లో జగన్‌ మాట్లాడారు. అవినీతి, లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందించామని ఆయన పేర్కొన్నారు.

59 నెలల్లో ఎన్నో విప్లవాలు తీసుకొచ్చా

‘గతంలో ఎవరూ చేయని పాలనను చేసి చూపించాను. 59 నెలల్లో ఎన్నో విప్లవాలు తీసుకువచ్చాను. రూ.2.7 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో వేశాను. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకొచ్చాం. నామినేటెడ్‌ పదవుల్లో చట్టం చేసి మరీ మహిళలకు అవకాశం కల్పించాం. ఇవన్నీ విప్లవాలు కాదా’ అని సీఎం ప్రశ్నించారు. ‘జగన్‌ గెలిస్తే పథకాలు కొనసాగుతాయి.. లేకుంటే ముగింపే’ అని పేదలను భయపెట్టేందుకు యత్నించారు. ఈ సభల్లో పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు, అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిబూడి ముత్యాలనాయుడు,  బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కారుమూరి సునీల్‌ కుమార్‌, అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ల నానీలను పరిచయం చేశారు.

బొబ్బిలి సభలో జగన్‌వి అన్నీ అబద్ధాలే

బొబ్బిలి పట్టణంలో జరిగిన సభలో తనను ఓడించలేక చంద్రబాబు రకరకాల మోసాలకు తెగబడుతున్నారంటూ సీఎం జగన్‌ ఆరోపణలు చేయడం మినహా ఈ ప్రాంతంలోని ఒక్క సమస్యనూ  ప్రస్తావించలేదు. బొబ్బిలిలోని గ్రోత్‌ సెంటర్‌, తోటపల్లి ప్రాజెక్టు విస్తరణ వంటి ఎన్నో సమస్యలను ప్రస్తావిస్తారని ప్రజలు ఆశించినా నిరాశే ఎదురైంది.

మండుటెండలో ఉక్కిరిబిక్కిరై..

పాయకరావుపేటలో సభకు జనాలను ఆటోల్లో తరలించారు. మండుటెండలో తీసుకుని రావడంతో వారు ఉక్కిరిబిక్కిరైపోయారు. నీడ లేక రోడ్డుపై నిలబడడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్‌ సరిగ్గా 2 గంటలకు పేటకు చేరుకున్నారు. ఆయన బస్సుపైకి రాగానే వచ్చిన జనాల్లో చాలామంది మీరెంత డబ్బు ఇచ్చినా ఉండలేం బాబూ అంటూ వెళ్లిపోవడం కనిపించింది. వచ్చిన వారికి రూ.300 చొప్పున పంచిపెట్టారు.

బొబ్బిలి సభ ఆలస్యం.. సొమ్మసిల్లిన జనం

బొబ్బిలి సభను తొలుత కళాభారతి వద్ద ఏర్పాటు చేయాలనుకున్నారు. కోట ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తే రోడ్డు పొడవునా జనం కనిపిస్తారన్న ఉద్దేశంతో మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి మార్చేశారు. అయినప్పటికీ జనం పలుచగానే కనిపించారు.

50 మంది సొమ్మసిల్లారు

ముఖ్యమంత్రి జగన్‌ సభ ఉదయం తొమ్మిది గంటలకే ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నలుమూలల నుంచి జనాలను వాహనాల్లో రప్పించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సీఎం వచ్చారు. ఎండ వేడికి అప్పటికే చాలా మంది వెళ్లిపోయారు. మిట్ట మధ్యాహ్నం కావడంతో సభకు వచ్చిన వారిలో సుమారు పదిమంది సొమ్మసిల్లి పడిపోయారు.

గర్భిణికి అవస్థలు

పట్టణానికి చెందిన గర్భిణి నాగమణిని అత్యవసరంగా బంధువులు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు. సభ ముగిసిన తర్వాత సీఎం హెలిప్యాడ్‌ వద్దకు వాహనంలో బయలుదేరడంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను ఆపేశారు. ఆ రద్దీలో ఆటో ఉండిపోయింది. ఆమె బంధువు పోలీసులకు సమస్యను వివరించినా సీఎం హెలికాప్టర్‌లో వెళ్లిన తర్వాతే విడిచిపెడతామని చెప్పడంతో వారు ఆటోలోనే నిరీక్షించారు.

 ఏలూరులో సీఎం ప్రసంగం పూర్తికాకుండానే అనేక మంది వెనుదిరిగి వెళ్లిపోయారు. మహిళలను వైకాపా నాయకులు ఆటోల్లో తరలించారు. వారికి డబ్బులు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img