icon icon icon
icon icon icon

ప్రాణాలకు తెగించి నయవంచకుడితో తలపడుతున్నా!

‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు.

Published : 02 May 2024 05:58 IST

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ అయిపోయింది
వైకాపాకు ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే
కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దుచేస్తాం
వారాహి విజయభేరి సభల్లో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు-విశాఖపట్నం, అనకాపల్లి, రాజమహేంద్రవరం: ‘సగటు మనిషి కోసం ప్రాణాలకు తెగించి.. ఒక నయవంచకుడు, గూండా, ఒక దోపిడీదారుడిపై పోటీ చేయడానికి మీ గళమై.. గుండె చప్పుడై.. ఇక్కడ ఉన్నా’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ‘నాన్న లేని బిడ్డను ఒకే ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి’ అని జగన్‌ అడిగితే అంతా ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్‌ అయిపోయింది.. ఇక చాలు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా దోచేశారో చూశారు.. ఈసారి మీకు మీరు ఛాన్స్‌ ఇచ్చుకోండి.. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్‌ తీసుకోండి’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పెందుర్తి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటల్లో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. ఆడబిడ్డల భద్రతకు పెద్దపీట వేస్తాం. వైకాపా వారికి ఒక్కఛాన్స్‌ ఇస్తే రూ.60 ఉన్న మద్యంను రూ.200కు పెంచి జలగలా పీల్చేశారు. రూ.41 వేల కోట్లకు ఇసుకను అమ్మేశారు. కనిపించే కొండ ఎవరిది? గాలి.. నీరు.. నిప్పు..నేలా మనందరివీ.. ఒక్క జగన్‌వో, వైకాపా ఎమ్మెల్యేలవో కాదు’ అని పవన్‌ స్పష్టం చేశారు.

జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

‘మీ ఆస్తులను దోచేయడానికి జగన్‌ ఒక చట్టం తెస్తున్నారు. అది ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కాదు.. ‘జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌’. మరో దఫా వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదు. ఆస్తి పత్రాలపై జగన్‌ ఫొటో ఎందుకు? ఒరిజినల్‌ స్టాంపు పేపర్లు, పట్టాదారు పాసు పుస్తకాలు మన దగ్గర ఉండాలి. ఈ చట్టం వస్తే జిరాక్సులే ఉంటాయి. ఎవరైనా కబ్జా చేస్తే రెవెన్యూ అధికారి దగ్గరకు వెళ్లాలట. వాళ్లంతా ఒక్కటైతే పరిస్థితి ఏంటి? అక్కడ అన్యాయం జరిగితే ఎంతమంది కోర్టుకు వెళ్లగలరు. వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాలిలో దీపాలే. మీ ఆస్తి పత్రాల ఒరిజినల్స్‌ అన్నీ హైదరాబాద్‌లోని జగన్‌ ఇంట్లో ఉంటాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. ఈ చట్టం కేంద్రం తెచ్చిందని వైకాపా నాయకులు అంటున్నారు. కేంద్రం ముసాయిదా మాత్రమే పంపుతుంది. దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి కానీ చర్చించరు. తెదేపా వారిని మాట్లాడనీయరు. పట్టాదారు పాసు పుస్తకంపై రాజముద్ర ఉండాలి, మీ ఫొటో కాదు జగన్‌.. పాస్‌పోర్ట్‌పై ప్రధాని ఫొటో లేదు కదా’ అని వైకాపా సర్కారుపై పవన్‌ విమర్శలు గుప్పించారు.

యువత మార్పు కోరుకోవాలి

‘యువత మార్పు కోరుకుంటే తప్ప ఏదీ జరగదు. రాష్ట్రంలో దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి బానిసైంది. వైకాపా నాయకులు రాష్ట్రాన్ని గంజాయి రవాణాలో తొలి స్థానంలో పెట్టారు. పోర్టులో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ దొరికాయి. ఉపాధి అవకాశాలు కల్పించలేదు. రూ.450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి, ఉద్యోగుల తాలూకా గ్రాట్యుటీ ఫండ్‌ దోచేశారు. ఇన్ని చేసి.. మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తే.. ‘గెట్‌ లాస్ట్‌ జగన్‌’ అనండి. చెత్త పన్నేసిన ప్రభుత్వాన్ని చెత్తలో పడేద్దాం’ అంటూ పవన్‌ పిలుపునిచ్చారు. ‘పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ తీసుకురావడానికి కృషి చేస్తాం. అచ్యుతాపురం సెజ్‌ కోసం 26 గ్రామాల నుంచి 4 వేల ఎకరాలిచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వారికి అండగా నిలుస్తాం. భవన నిర్మాణ కార్మికులకు మేలు చేసేందుకు ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తాం. సహజ వనరులు జగన్‌రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డిల సొంతం కాదు. గుత్తాధిపత్యంతో పెత్తనం చేస్తానంటే తొక్కేస్తాం. జగన్‌ కులాలను వాడుకొని ఎదుగుతున్నారు. మనం వాటిని దాటకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది. రైతుల సమస్యలు పరిష్కారమవ్వాలంటే వైకాపాకు పొలిటికల్‌ హాలీడే ప్రకటించాలి’ అని ధ్వజమెత్తారు. ‘మండపేటకు వెళితే రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, ప్రభాస్‌, చిరంజీవి ఫొటోలు పెట్టారు. అల్లు అర్జున్‌ ఫొటో పెట్టి తగ్గేదేలే అంటూ యువత ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. యువత ఎన్నికల సమయంలో వైకాపాకు ‘తగ్గేదేలే’ అని చెప్పి గద్దె దించుతామనండి’ అంటూ పవన్‌ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యానిఫెస్టో ప్రకటించామని వివరించారు.

కన్నబాబురాజు కాదు కన్నాల బాబు

‘ఎలమంచిలి వైకాపా ఎమ్మెల్యే కన్నబాబురాజు కాదు.. కన్నాల బాబు అని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. సింహాచలం భూముల్లో పంచగ్రామాల సమస్యపై ఇప్పటికీ నలుగుతోంది. కన్నబాబురాజు సింహాచలం ఆలయ భూమి ఆక్రమించి భారీ భవనం నిర్మిస్తే అడిగే దిక్కులేదు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలిస్తామని హామీ ఇచ్చిన జగన్‌ తర్వాత పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తానే ముందుండి తాడి గ్రామాన్ని క్షేమంగా మరో ప్రాంతానికి తరలిస్తాం’ అని హామీ ఇచ్చారు. అనకాపల్లి లోక్‌సభ ఎన్డీయే అభ్యర్థి సీఎం రమేష్‌ (భాజపా), ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ (జనసేన), పెందుర్తి అసెంబ్లీ నుంచి పంచకర్ల రమేష్‌బాబు (జనసేన)లను గెలిపించాలని పవన్‌ కోరారు.

ద్వారంపూడి కుటుంబంతో రైతులకు కన్నీరు

‘కాకినాడ నగర వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇంట్లోని వారికే మూడు పదవులున్నాయి. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల కష్టాన్ని జగన్‌ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం దోచుకుంటోంది. వారి అక్రమాలు ఆపేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించాలి. కోనసీమ జిల్లాలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఒకప్పుడు కొట్టుకున్నా, రాజకీయ అవసరాల కోసం కలిశారు. వీరు యానాం-రావులపాలెం ఏటిగట్టు రోడ్డు నిర్మాణానికి ఎందుకు పనిచేయలేదో ఆలోచించాలి. కోనసీమ అల్లర్ల పేరుతో ఎక్కువమంది అమాయకులపై కేసులు పెడితే.. తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు వారికి అండగా నిలవలేదు. ఓట్ల కోసం ఇటీవల కేసులు ఎత్తేస్తే, అందులో ఏ1.. మంత్రి విశ్వరూప్‌ వెనుక తిరుగుతున్నారు. దీన్నిబట్టి ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారో ఆలోచించాలి’ అని కోరారు. మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి హరీష్‌మాథుర్‌లను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ పాల్గొన్నారు. విజయభేరి సభల్లో పవన్‌ ముందుగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img