icon icon icon
icon icon icon

గాజు గ్లాసు గుర్తుపై విచారణ వాయిదా

తెదేపా, జనసేన, భాజపా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Published : 03 May 2024 05:36 IST

ఇతరులకు కేటాయిస్తే కూటమికి ఇబ్బందని తెదేపా పిటిషన్‌
ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందన్న ఈసీ
ఈ-పోస్టల్‌ బ్యాలెట్లను ఇప్పటికే పంపామని హైకోర్టుకు వెల్లడి

ఈనాడు, అమరావతి: తెదేపా, జనసేన, భాజపా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరుతూ తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. గురువారం జరిగిన విచారణలో ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. బుధవారం సాయంత్రానికే బ్యాలెట్ల ముద్రణ ప్రారంభమైందన్నారు. భద్రతాదళాలకు ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్లను ఇప్పటికే పంపామన్నారు. రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన వృద్ధుల్లో ఇంటి వద్ద ఓటేసేందుకు ఐచ్ఛికాన్ని ఇచ్చిన వారితో ఓటేయించే ప్రక్రియ గురువారం ప్రారంభమైందన్నారు. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోకుండా అధికరణ 329(బి) నిషేధిస్తోందన్నారు. పిటిషనర్‌కు వ్యాజ్యం దాఖలు చేసే అర్హత లేదన్నారు. ఈ దశలో కోర్టు జోక్యం చేసుకుంటే ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నివేదించారు. సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. పిటిషనర్‌ నుంచి వివరాలు సేకరించి కోర్టుకు వెల్లడించేందుకు సమయం కావాలన్నారు. దీంతో వ్యాజ్యంపై విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ప్రకటించారు.

గాజు గ్లాసు గుర్తు వేరేవారికి ఇస్తే కూటమికి ఇబ్బంది

అంతకు ముందు జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల్లో పార్టీ గుర్తు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తు మాత్రమే ఉంటాయన్నారు. నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తును చూసి ఓటేసే అవకాశం ఉందన్నారు. గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తే కూటమి అభ్యర్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియను నిలువరించాలని తాము కోరడం లేదని, తమ వినతిపై తగిన నిర్ణయం వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరుతున్నామని చెప్పారు. ఈసీ తరఫు న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ముందు (ప్రీ పోల్‌) ఏర్పరుచుకునే పొత్తుకు చట్టంలో గుర్తింపు లేదన్నారు. గుర్తుల కేటాయింపు ఏ దశలో ఉందో కనుక్కొని చెప్పేందుకు విచారణను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అనంతరం జరిగిన విచారణలో బ్యాలెట్ల ముద్రణ, పోస్టల్‌ బ్యాలెట్ల సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని కోర్టుకు విన్నవించారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img