icon icon icon
icon icon icon

నేటి నుంచి నారా రోహిత్‌ పర్యటన

ఎన్డీయేకు మద్దతుగా సినీనటుడు నారా రోహిత్‌ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. 4న పలాస, అనకాపల్లి, 5న రాజానగరం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు.

Updated : 04 May 2024 06:44 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఎన్డీయేకు మద్దతుగా సినీనటుడు నారా రోహిత్‌ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. 4న పలాస, అనకాపల్లి, 5న రాజానగరం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 11 వరకు ఆయన పర్యటన సాగనుంది.


వైకాపా కార్యకర్తల్లా నెల్లూరు, రాజమహేంద్రవరం డీఎస్పీలు

సీఈఓకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా కార్యకర్తల్లా మారిన నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, రాజమహేంద్రవరం సిటీ డీఎస్పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని తెదేపా నేతలు కోరారు. సీఎంఓ అధికారి నీలకంఠరెడ్డితో వీరాంజనేయరెడ్డికి బంధుత్వం ఉందని, దీంతో ఆయన వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విజయ్‌పాల్‌ అయితే ఏకంగా రాజమహేంద్రవరంలో తెదేపా వాళ్లపై తప్పుడు కేసులు పెడుతూ బైండోవర్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు శుక్రవారం ఫిర్యాదు చేశారు.


‘ఐదు గ్రామాలు తెలంగాణలో విలీనం చేస్తాం’

ఆ రాష్ట్ర మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఆ రాష్ట్రానికి ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది. ఇందులో 23 అంశాలున్నాయి. ‘భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అడ్డుగా ఉంది. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు-ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నెగూడెం, పిచ్చుకలపాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తాం’ అని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.


ముస్లిం రిజర్వేషన్లను కొనసాగించేది చంద్రబాబే: ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను గతంలో కాపాడింది.. భవిష్యత్తులో కొనసాగించేది కూడా తెదేపా అధినేత చంద్రబాబేనని ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తెలిపారు. చంద్రబాబు సీఎం కాగానే ముస్లిం రిజర్వేషన్లకు న్యాయస్థానాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి ఆర్థికంగా వెనకబడిన వారికి వీటిని అమలుచేస్తారని వివరించారు. ముస్లింలంతా తెదేపాకు అండగా ఉన్నారనే అక్కసుతోనే రిజర్వేషన్ల అంశంపై వైకాపావాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన ఆర్‌.కృష్ణయ్యకు ఎంపీ పదవి ఇచ్చింది మీరు కాదా? అని సీఎం జగన్‌ను నిలదీశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదుల్ని నియమించి వాదనలు వినిపించారు. కానీ జగన్‌ తన పార్టీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్యతో పిటిషన్‌ ఉపసంహరించుకునేలా చేయలేదు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేలా ఎలాంటిచర్యలూ తీసుకోలేదు’ అని మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img