icon icon icon
icon icon icon

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతుల మెడకు ఉచ్చు

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ విమర్శించారు.

Published : 04 May 2024 05:37 IST

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ విమర్శించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం, భూముల రీ సర్వేతో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పగడాల శివపార్వతి, నాయకుడు అజయ్‌ వర్మతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. ‘నీతి ఆయోగ్‌ విధివిధానాల ప్రకారం భూ సర్వే మూడు దశల్లో నిర్వహించి వాటి వివరాలను డిజిటలైజ్‌ చేయాలి. రీ సర్వే 17 వేల గ్రామాల్లో చేయాల్సి ఉండగా కేవలం 4 వేల గ్రామాల్లోనే పూర్తయింది. భూ యజమానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే చేయడం వల్ల పెద్ద ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి. రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలుకు స్వయం ప్రతిపత్తి కలిగిన అథారిటీలను నియమించాలని నీతి ఆయోగ్‌ సూచించింది. వైకాపా ప్రభుత్వం దానికి విరుద్ధంగా విశ్రాంత సంయుక్త కలెక్టర్లను నియమించింది. తప్పు చేసిన అధికారిని శిక్షించాలని కేంద్రం నియమం పెడితే.. తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులను శిక్షిస్తామనడంలో ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోంది.  వివాదాలున్న భూములపై రైతులు ఎటువంటి రుణాలు పొందే వీలూ లేదు. కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం’ అని శివశంకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img