icon icon icon
icon icon icon

భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌పై వైకాపా మూకదాడి

అనకాపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, వైకాపా లోక్‌సభ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు.

Published : 05 May 2024 05:21 IST

ఆయన్ను తీసుకెళుతున్న పోలీసు వాహనంపై రాళ్లు విసిరి బీభత్సం
రమేశ్‌ చొక్కా చించేసిన డిప్యూటీ సీఎం బూడి అనుచరులు
ముత్యాలనాయుడి స్వగ్రామంలో కూటమి కార్యకర్తలపై వైకాపా దాడి
వారిని పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రమేశ్‌పైనా దౌర్జన్యం

ఈనాడు- అనకాపల్లి,  న్యూస్‌టుడే- చీడికాడ, దేవరాపల్లి: అనకాపల్లి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి, వైకాపా లోక్‌సభ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైకాపా నేతలు దాడికి పాల్పడ్డారు. ఓ భాజపా కార్యకర్తను చెప్పుతో కొట్టారు. సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌పై దౌర్జన్యం చేసి చొక్కా చించేశారు. ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళుతున్న  పోలీసు వాహనంపై రాళ్లు విసిరి రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. భాజపా కార్యకర్తలు ప్రచారంలో భాగంగా శనివారం దేవరాపల్లి మండలం తారువలో డ్రోన్‌తో కమలం గుర్తు జెండాను ఎగరవేశారు. అక్కడున్న డిప్యూటీ సీఎం, ఆయన అనుచరులు డ్రోన్‌ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగారు. ‘ఇక్కడెవరు మిమ్మల్ని డ్రోన్‌ ఎగరేయమన్నారు? రెక్కీలు నిర్వహిస్తున్నారా’ అంటూ దాడి చేశారు. జెండాతో ఉన్న డ్రోన్‌ను పగలగొట్టేశారు. ఆపరేటర్లు, భాజపా కార్యకర్తల కారు టైర్లలో గాలి తీసేశారు. బైక్‌లను అడ్డగించి చౌడవాడకు చెందిన భాజపా కార్యకర్త కొమర అప్పారావుపై చేయి చేసుకున్నారు. స్థానిక భాజపా కార్యకర్త, డిప్యూటీ సీఎం బావమరిది చప్ప గంగాధర్‌ ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వైకాపా కార్యకర్తలు వెంటపడటంతో ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. ముత్యాలనాయుడు తన అనుచరులతో తలుపులు బద్దలుకొట్టి గంగాధర్‌ను చెప్పుతో కొడుతూ, తీవ్ర పదజాలంతో దూషించారు. దేవరాపల్లి ఎస్సై నాగేంద్ర అక్కడికి వెళ్లి గంగాధర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. తమ కార్యకర్తలపై దాడి జరిగిందని తెలుసుకుని భాజపా అభ్యర్థిసీఎం రమేశ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారని సీఎం రమేశ్‌, తెదేపా అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు, స్వతంత్ర అభ్యర్థి, బూడి ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్‌, పెద్ద ఎత్తున కూటమి కార్యకర్తలతో స్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

పోలీసుల సమక్షంలోనే దాడి

భాజపా కార్యకర్తను పరామర్శించడానికి సీఎం రమేశ్‌ తారువ వెళ్లారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూడా అక్కడే అనుచరులతో కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న వైకాపా కార్యకర్తలు సీఎం రమేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు రెండు గంటలపాటు ఇరువర్గాల వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. పోలీసులు సీఎం రమేశ్‌ను తమ వాహనంలో ఎక్కించి దేవరాపల్లి స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. బూడి వర్గీయులు పోలీసు వాహనంతో పాటు సీఎం రమేశ్‌ వాహనాలపైకి రాళ్లు, కర్రలు విసిరి రెండు గంటలపాటు బీభత్సం సృష్టించారు. సీఎం రమేశ్‌ చొక్కా చించేశారు. ఆయనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు.

కుటుంబసభ్యుల పైనా దాడి

మాడుగుల ఎమ్మెల్యే సీటును ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధకు కేటాయించడంతో మొదటి భార్య కుమారుడు రవికుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. తన తండ్రిని ఓడించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు మొదటి భార్య తమ్ముడు చప్ప గంగాధర్‌ భాజపాకు మద్దతుగా తిరుగుతున్నారు. ఇది మనసులో పెట్టుకున్న ముత్యాలనాయుడు భాజపా కార్యకర్తలపై దాడి సమయంలో బావమరిది గంగాధర్‌పైనే ముందుగా దాడి చేశారు. మారణాయుధాలతో దాడి చేసి చంపబోయారని గంగాధర్‌ అనిమిరెడ్డి గోవింద, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుపై దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఓటమి భయంతోనే దౌర్జన్యాలు: సీఎం రమేష్‌

ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దౌర్జన్యాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సీఎం రమేశ్‌ తెలిపారు. అనకాపల్లి ఎంపీ స్థానంలో తాను, మాడుగులలో తన కుమార్తె ఓడిపోతామనే భయంతోనే ముత్యాలనాయుడు ఇలా దాడులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

సీఎం రమేశ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img