icon icon icon
icon icon icon

పోస్టల్‌ బ్యాలెట్‌లో గందరగోళం

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘం గందరగోళం సృష్టిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు చేస్తూ అయోయమం సృష్టిస్తోంది.

Published : 05 May 2024 06:36 IST

ఓటేసేందుకు ఉద్యోగుల పాట్లు
మచిలీపట్నంలో ఓటింగ్‌ తేదీని మార్చడంపై నిరసన

ఈనాడు, అమరావతి, చింతలపూడి, నూజివీడు రూరల్‌, పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌పై ఎన్నికల సంఘం గందరగోళం సృష్టిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధానం అమలు చేస్తూ అయోయమం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.30 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల సంఘం సృష్టిస్తున్న గందరగోళం, కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలామంది ఓటుహక్కు కోల్పోవాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. విజయవాడ, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో శనివారం ఈ ప్రక్రియను మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఉద్యోగుల కోసం చాలాచోట్ల సమాచార కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. కనీసం మంచినీటి సౌకర్యం కల్పించలేదు. బ్యాలెట్‌ ఓటు వేసేందుకు శనివారం మచిలీపట్నం రావాలని సంబంధిత కేంద్రం పరిధి ఉద్యోగులకు చెప్పిన అధికారులు ముందస్తు సమాచారం లేకుండానే ఓటింగ్‌ను ఆరో తేదీకి వాయిదా వేశారు. బ్యాలెట్‌ పేపర్లు రాలేదని సమాధానమిచ్చారు. మండేఎండలో ఉద్యోగులకు వ్యయప్రయాసలు తప్పలేదు. వారు కేంద్రం వద్ద ఆందోళన చేశారు. అంతరజిల్లా ఉద్యోగులు తాము పనిచేస్తున్న జిల్లాకేంద్రంలో ఓటు హక్కు వేయాలని ఆదేశాలివ్వడంతో చాలాచోట్ల ఉద్యోగులకు ఇబ్బందులెదురయ్యాయి. ఒంగోలు ఒకటో నంబరు పోలింగ్‌ కేంద్రంలో ఓటరు ధ్రువీకరణ పత్రంపై గెజిటెడ్‌ అధికారి సుబ్బారావు సంతకం పెట్టి స్టాంపు వేయలేదు. దాదాపు 25 మంది ఓటర్లకు ఇలాగే చేశారు. ఆర్వో దృష్టికి వెళ్లగా ఆయన్ని తప్పించి వేరే వారిని నియమించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని రాప్తాడు శాసనసభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఓట్లు గల్లంతయ్యాయి. కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి ప్రాంతాల్లో 150 మందికిపైగా ఉద్యోగుల ఓట్లు లేవు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు ఫాం-12 సమర్పించేందుకు ఈనెల ఒకటో తేదీ చివరిగడువు కాగా కొంతమంది అంగన్‌వాడీలు, ఒప్పంద ఉద్యోగులు, టీచర్లకు ఎన్నికల విధులు కేటాయిస్తూ తీరిగ్గా రెండో తేదీన ఆదేశాలిచ్చారు. వీరు ఫాం-12 సమర్పణకు వెళితే గడువు ముగిసిందని రిటర్నింగ్‌ అధికారులు నిరాకరించారు. ఇలా వందల మంది ఓటు హక్కు కోల్పోవాల్సి వచ్చింది.

చింతలపూడిలో అయోమయం

ఏలూరు జిల్లా చింతలపూడి బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఎనిమిదింటికే ఉద్యోగులు చేరుకున్నారు. పోలింగ్‌ శిక్షణ సమయంలో ఉద్యోగులు ఎక్కడ ఫాం-12 అందజేశారో అక్కడే ఓటేయాలని అధికారులు చెప్పడంతో పలువురు రిటర్నింగ్‌ అధికారితో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు తమ ఫాం-12 సమర్పణ కేంద్రంతో సంబంధం లేకుండా ఓటు హక్కు ఏ నియోజకవర్గ పరిధిలో ఉంటే అక్కడే ఓటేయాలని చెప్పారని ఉద్యోగులు తెలిపారు. ఇప్పుడు భిన్నంగా చెప్పడమేంటని ప్రశ్నించారు.


నూజివీడులో వైకాపా హడావుడి

నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో ఉన్న కేంద్రం వద్దకు వైకాపాకు చెందిన మాజీ కౌన్సిలర్లు కొందరు ఏజెంట్లుగా వచ్చి ఉద్యోగులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి తదితరులు హుటాహుటిన వెళ్లి అభ్యంతరం తెలిపారు. జిల్లా కలెక్టరు ప్రసన్న వెంకటేష్‌ దృష్టికీ తీసుకెళ్లారు. కేంద్రం వద్దకు కలెక్టరు వచ్చేసరికి తెదేపా, వైకాపా నాయకులను స్థానిక అధికారులు బయటకు పంపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img