icon icon icon
icon icon icon

శిరోముండనం కేసు తీర్పు అమలుపై స్టే జూన్‌ 20 వరకు పొడిగింపు

దళితులకు శిరోముండనం ఘటనలో మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఇతర దోషులకు 18 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు జూన్‌ 20 వరకు పొడిగించింది.

Published : 09 May 2024 07:36 IST

ఈనాడు, అమరావతి: దళితులకు శిరోముండనం ఘటనలో మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఇతర దోషులకు 18 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు జూన్‌ 20 వరకు పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. అంతకుముందు దోషుల తరఫున సీనియర్‌ న్యాయవాది కె చిదంబరం వాదనలు వినిపిస్తూ.. తీర్పు అమలును నిలుపుదల చేస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఈ నెల 15తో ముగుస్తున్నాయని, వాటిని పొడిగించాలని కోరారు. పొడిగించకపోతే ఏమవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ.. వెంటనే అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. దీంతో న్యాయమూర్తి.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను జూన్‌ 20 వరకు పొడిగించారు. బాధిత దళితుల తరఫున న్యాయవాది వై కోటేశ్వరరావు, పిచ్చుక శ్రీనివాసరావు, జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని, కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రస్తుతానికి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నామని, అభ్యంతరం ఉంటే వాటిని ఎత్తివేయాలని తదుపరి విచారణలో కోరవచ్చని పేర్కొన్నారు. బాధితుల వాదనలు వినకుండా తుది విచారణ జరగదన్నారు. కౌంటర్‌ వేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేశారు.

కేసు తీర్పు అమలు నిలిపివేయడం విచారకరం: సీపీఎం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వెంకటాయపాలెం శిరోముండనం కేసు తీర్పు అమలును నిలిపివేయడం విచారకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పును నిలిపేయడంతో దళితులకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తీర్పు అమలయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img