icon icon icon
icon icon icon

ముస్లింల ఆత్మగౌరవాన్ని జగన్‌ దెబ్బతీశారు

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ ధ్వజమెత్తారు.

Published : 09 May 2024 07:38 IST

పెద్దసంఖ్యలో దాడులు జరిగినా అడ్డుకోలేదు
ఏళ్లుగా అందుతున్న ప్రత్యేక పథకాల్ని తీసేశారు
జగన్‌ మళ్లీ గెలిస్తే ప్రత్యేక బడ్జెట్‌ అనేదే ఉండదు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్‌ షిబ్లీ ధ్వజమెత్తారు. మెజారిటీ ఘటనల్లో నిందితులుగా వైకాపా నేతలు, వారి అనుచరులే ఉన్నారని, ఏ ఒక్కరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ‘సభా వేదికలపై నా మైనారిటీలు, నా మైనారిటీలు అనడమే తప్ప... ముస్లింలకు జగన్‌ చేసిందంతా దగానే. ఏళ్లుగా ప్రత్యేకంగా అమలవుతున్న పథకాలన్నింటినీ ఆయన రద్దు చేశారు. మసీదులు, ఈద్గాలకు అందే సాయాన్ని నామమాత్రం చేశారు. ప్రత్యేకంగా అందే చేయూత లేకుండా చేసి ముస్లింల ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశారు’ అని మండిపడ్డారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘నంద్యాల జిల్లాలో అమాయకుడైన అబ్దుల్‌ సలాంపై దొంగ అనే ముద్ర వేసి, వేధించి కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన అధికార పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కర్నూలు జిల్లాకు చెందిన హజీరాను అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ నిందితుల్ని గుర్తించలేదు. చిత్తూరు జిల్లా పలమనేరులో... చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్న విద్యార్థిని మిస్బాను అధికార పార్టీ నాయకుడు పొట్టన పెట్టుకున్నా కనీస చర్యలు తీసుకోలేదు’ అని షిబ్లీ మండిపడ్డారు.

బడ్జెట్‌ కాగితాలకే పరిమితం

మైనారిటీల బడ్జెట్‌ను జగన్‌ కాగితాలకే పరిమితం చేశారు. ముస్లింలకంటూ ఒక్క పథకమూ లేదు. పండుగ పూట అందించే రంజాన్‌ తోఫానూ నిలిపేశారు. ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేక పథకాల ఊసే లేదు. జగన్‌ మళ్లీ గెలిస్తే మైనారిటీలకు బడ్జెట్‌ కోటా లేకుండా చేస్తారు. మసీదుల మరమ్మతులకు తెదేపా ప్రభుత్వం రూ.35.94 కోట్లు కేటాయిస్తే జగన్‌ ఇచ్చింది రూ.87.82 లక్షలే. రంజాన్‌ నిర్వహణకు తెదేపా ప్రభుత్వం రూ.20.25 కోట్లు ఖర్చు చేస్తే వైకాపా ప్రభుత్వం వెచ్చించింది రూ.1.60 కోట్లే. విదేశీ విద్యకు నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్య పెరగకుండా చేశారు. గత ప్రభుత్వంలో ఎంపికై విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు ఆర్థికసాయం అందించకుండా జగన్‌ వేధించారు. పెళ్లికానుక పథకానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తెచ్చి లబ్ధిని చాలామందికి దూరం చేశారు. ముస్లిం మహిళలకు చేయూతగా నిలిచే కుట్టుమిషన్ల పథకాన్నీ తీసేశారు. షేక్‌, దూదేకులు, సయ్యద్‌, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్లకు ఒక్క రూపాయీ కేటాయించలేదు. ఉర్దూ భాష అకాడమీని పట్టించుకోలేదు. హజ్‌ భవనాలను ఏర్పాటు చేయలేదు. తెదేపా ప్రభుత్వం కట్టిందనే కక్షతో గురుకుల పాఠశాలలను వినియోగంలోకి తీసుకురాలేదు. ఉర్దూ ఘర్‌ కం షాదీఖానాలను నిర్వీర్యం చేశారు. గత ప్రభుత్వం ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రూ.18 కోట్లను మళ్లించేశారు. వక్ఫ్‌బోర్డును జగన్‌ నిర్వీర్యం చేశారు. వక్ఫ్‌ ఆస్తుల్ని వైకాపా నేతలు ఆక్రమించుకుంటున్నా ఆపలేదు.

హత్యాయత్నం కేసులు.. రౌడీషీట్లు...

రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలపై వైకాపా ప్రభుత్వం లెక్కలేనన్ని కేసులు పెట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు, మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై గొంతెత్తి మాట్లాడినందుకు పోలీసుల చేత అణచివేసే ప్రయత్నం చేసింది. పుంగనూరు, చిత్తూరు, మదనపల్లెల్లో ముస్లింలపై ఇబ్బడిముబ్బడిగా అక్రమ కేసులు పెట్టారు. యువకులపై రౌడీషీట్లు తెరిచారు. ఇంటర్‌ చదివే పిల్లలపైనా కేసులు పెట్టి వేధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img