icon icon icon
icon icon icon

నా మెజారిటీని తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారు

మంగళగిరి నియోజకవర్గంలో తన మెజారిటీ తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 03:59 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గంలో తన మెజారిటీ తగ్గించేందుకు రూ.300 కోట్ల దోపిడీ సొమ్ము పంపారని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. మంగళగిరి మండలం కురగల్లులో గురువారం నిర్వహించిన ‘రచ్చబండ’లో ఆయన మాట్లాడారు. ‘ఓటుకు రూ.10 వేలు ఇస్తారట. ఇదంతా మీ డబ్బే తీసుకోండి. కానీ నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు వచ్చిన నాకు ఓటేసి గెలిపించండి’ అని కోరారు. ఆ వ్యాఖ్యలకు గ్రామస్థులనుంచి మంచి స్పందన వచ్చింది. విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు, ఇసుక, మద్యం, పెట్రోల్‌, డీజిల్‌, ఇంటి, చెత్త పన్నుల పేరుతో జగన్‌ ఒక్కో కుటుంబంనుంచి సుమారు రూ.రెండున్నర లక్షలు కొట్టేశారని, అందులో పది శాతం సొమ్ము ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. మరో 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలని వచ్చానని, హామీలన్నీ నెరవేర్చి మీతో శభాష్‌ అనిపించుకుంటానని అన్నారు.

కుప్పంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తా..

మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక కుప్పం నియోజకవర్గంతో పోటీపడి మంగళగిరిని అభివృద్ధి చేస్తానని లోకేశ్‌ అన్నారు. కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో కూటమికి మెజారిటీ ఎక్కడ ఎక్కువ వస్తుందనే విషయంలోనే తమ మధ్య పోటీ నెలకొందని చమత్కరించారు. ‘రూ.500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్‌ కట్టుకున్నారు.. అదే డబ్బు నియోజకవర్గంలో ఖర్చుపెట్టి ఉంటే ప్రతి నిరుపేద కుటుంబానికీ ఇల్లు, సురక్షిత తాగునీరు ఇవ్వొచ్చు’ అని అన్నారు. వైకాపాకు మద్దతుదారులుగా ఉన్న 260 కుటుంబాలు తెదేపాలో చేరాయి. మంగళగిరి 21వ వార్డుకు చెందిన గుంటి ప్రతాప్‌, మునగాల రమేష్‌, వంగర హనుమంతరావు ఆధ్వర్యాన 200 చేనేత కుటుంబాలు, మంగళగిరిలోని వకుళాదేవి నేతృత్వంలో 30 కుటుంబాలు, బాపనయ్యనగర్‌కు చెందిన దిడ్లా సత్యానందం ఆధ్వర్యాన 30 కుటుంబాలు, మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన తోట చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 15 మంది తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img