icon icon icon
icon icon icon

4 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని సీఎం జగన్‌ అన్నారు. కర్నూలు వైఎస్సార్‌ సర్కిల్‌ సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు.

Published : 10 May 2024 03:59 IST

కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట సభల్లో సీఎం జగన్‌

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగనుందని సీఎం జగన్‌ అన్నారు. కర్నూలు వైఎస్సార్‌ సర్కిల్‌ సమీపంలో గురువారం ఏర్పాటుచేసిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో మాట్లాడారు. పాఠశాలల్లో 30వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగాఉండగా ‘నాడు-నేడు’తో ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయని చెప్పుకొచ్చారు. ‘కర్నూలు నగర చిరంజీవి అభిమానులు’ పేరుతో కొందరు చిరంజీవి, జగన్‌ చిత్రాలతో ముద్రించిన కరపత్రాలను ముఖ్యమంత్రి సభలో పెద్దఎత్తున పంపిణీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌తో జగన్‌ ఉన్న ప్లకార్డులనూ సభలో ప్రదర్శించారు.

వివక్షకు తావులేకుండా డబ్బులిచ్చాం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: తమ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో జగన్‌ ప్రసంగించారు. ‘‘విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ వైకాపానే. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, ఆరో తరగతి నుంచే డిజిటల్‌ బోధన, 8వ తరగతి నుంచి ప్రతి విద్యార్థికి ట్యాబ్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశాం. గతంలోచదువులపై ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా చూశారా’ అని జగన్‌ ప్రశ్నించారు.

మద్యం మత్తులో వీరంగం

కర్ణాటక నుంచి తెప్పించిన మద్యం టెట్రా ప్యాకెట్లను కార్యకర్తలకు పంపిణీ చేశారు. మద్యం తాగి సభకు వచ్చిన వైకాపా కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సీఎంతో ఫొటోలు దిగాలని బారికేడ్లను తోసేందుకు ప్రయత్నించారు. కొందరు బారికేడ్లు దూకి సీఎం బస్సువైపు దూసుకెళ్లారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన కానిస్టేబుళ్లపై దాడికి ప్రయత్నించారు. అప్పటికే సీఎం జగన్‌ ప్రసంగం ముగించుకుని హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లిపోయారు.

ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం

ఈనాడు-కడప, న్యూస్‌టుడే-రాజంపేట: అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం జరగాలంటే మళ్లీ వైకాపాను గెలిపించాలని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే పింఛా ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో గురువారం జరిగిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడుతూ చంద్రబాబు రాజంపేట, మదనపల్లె, రాయచోటి వచ్చినప్పుడు జిల్లా కేంద్రాలుగా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మూడు ప్రాంతాలకు జిల్లా కేంద్రాలు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వస్తే ప్రత్యేకహోదాపై మాట్లాడతారని ప్రజలు ఆశించారని.. కానీ వాళ్లు చంద్రబాబును పొగుడుతూ మనపై నాలుగు రాళ్లు వేసి వెళ్లిపోయారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img