icon icon icon
icon icon icon

జగన్‌.. ఓ జలగ

‘జగన్‌ ఐదేళ్ల పాలనలో జనాలను జలగలా పీల్చి పిప్పి చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. వైకాపా నాయకులంతా మారీచులు.. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే.

Updated : 10 May 2024 06:56 IST

వైకాపా నాయకులంతా మారీచులు
మళ్లీ వారొస్తే రాష్ట్రం నాశనమే
ఆస్తిపత్రాలపై మళ్లీ రాజముద్రను తీసుకొస్తా
ప్రజలంతా కూటమిని ఆదరించండి
13న ఉదయం 7 గంటలకే ఓటేయాలి
కురుపాం, చీపురుపల్లి, విశాఖ సభల్లో చంద్రబాబు

ఈనాడు-విజయనగరం, విశాఖపట్నం, ఈనాడు డిజిటల్‌ విశాఖపట్నం, న్యూస్‌టుడే, సీతంపేట, చీపురుపల్లి, గరివిడి, కురుపాం గ్రామీణం: ‘జగన్‌ ఐదేళ్ల పాలనలో జనాలను జలగలా పీల్చి పిప్పి చేశారు. ఎక్కడా అభివృద్ధి లేదు.. వైకాపా నాయకులంతా మారీచులు.. దోచుకోవడం తప్ప అభివృద్ధి తెలియదు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమే. ఈ ఎన్నికల్లో కూటమికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసి చూపిస్తా. మీ పిల్లల భవితకు బంగారుబాట వేస్తా..’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని సీతంపేటలలో గురువారం ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. విశాఖలో రాత్రి వర్షపు జల్లులు కురిసినా భారీగా తరలివచ్చిన ప్రజలంతా చంద్రబాబు ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. తమ ప్రభుత్వ హయాంలో గిరిజన బిడ్డల కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తే జగన్‌ వాటిని ఎత్తేశారని మండిపడ్డారు. మన్యం వాసులపై ఆయనకు ఎందుకింత కక్షని ధ్వజమెత్తారు.

లేటరైట్‌ ముసుగులో దోపిడీ

‘బాక్సైట్‌ తవ్వకాలు నిలిపివేస్తే.. వైకాపా నేతలు తవ్వకాలు చేపట్టి సహజ సంపదను దోచుకున్నారు. లేటరైట్‌ ముసుగులో భారతి సిమెంట్‌ కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టారు. గిరిజన ప్రాంతంలోని వారికే ఉద్యోగావకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో జీవో నం.3 తీసుకొస్తే జగన్‌ తీసేశారు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తారా? మేం అధికారంలోకి వస్తే ఆ జీవోను తీసుకొస్తాం. మీ జీవితాలను అంధకారంలోకి నెట్టిన వ్యక్తి జగన్‌. ఎస్సీలకు 26 పథకాలు అమలుచేస్తే రద్దు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు యాభై ఏళ్లకే పింఛను ఇచ్చే బాధ్యత నాది’ అని భరోసానిచ్చారు.

జనవరిలో బటన్‌ నొక్కితే.. ఇంకా డబ్బులు పడలేదు

‘నాయకుడంటే ఉత్తుత్తి బటన్లు నొక్కడం కాదు. ఉద్యోగాలివ్వాలి. ఆడబిడ్డలకు రక్షణగా నిలవాలి. మీ ఆదాయం పెంచాలి. మోదీ బటన్‌ నొక్కుతున్నారు. ఏనాడైనా చెప్పారా? అదీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. జగన్‌ బటన్‌ నొక్కి వేసింది రూ.10.. బొక్కేసింది రూ.100. ‘బటన్‌ నొక్కా.. ఎన్నికల కమిషన్‌ డబ్బులు ఇవ్వొద్దంటోం’దని జగన్‌ చెబుతున్నారు. మరి జనవరిలో బటన్‌ నొక్కితే ఇన్నాళ్లూ ఎందుకు పడలేదు జగన్‌?’ అని ప్రశ్నించారు.

అది ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం

‘జగనన్న భూహక్కు పత్రం పేరుతో పాటు ఆ పుస్తకాల మీద జగన్‌ ఫొటో ఏంటి? ప్రజల ఆస్తి పత్రాల మీద రాజముద్ర ఉండాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చి జగన్‌ ఫొటోలున్న పత్రాలను చించి చెత్తబుట్టలో వేస్తా’ అని చంద్రబాబు భరోసానిచ్చారు. ‘వైకాపా ప్రభుత్వం ప్రజల భూములను కొట్టేయాలని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చింది. అది ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం. రికార్డులు ఉండవు. రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే జిరాక్సు పత్రాలిస్తారు. మన వివరాలన్నింటికీ ఓ కంపెనీకి చెందిన ప్రైవేటు వ్యక్తిని యజమానిగా ఉంచుతారు. మన ఆస్తులు అమ్మాలంటే జగన్‌ అనుమతి అవసరం. ప్రతి గ్రామంలో ప్రైవేటు గుమస్తాకు అధికారమిస్తారు. ఆయన ఒప్పుకోకపోతే మనం అమ్మడానికి వీలుండదు. జగన్‌ నియమించే ఆ అధికారి/వ్యక్తికి మన భూములపై పెత్తనమిస్తున్నారు. ఇలా అయితే ప్రజాఆస్తులకు రక్షణ ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఆ చట్టం రద్దు చేసే బాధ్యత తీసుకుంటా’నని హామీనిచ్చారు. అనంతరం జగన్‌ ఫొటో ఉన్న పుస్తకాన్ని ప్రజల ముందు చించారు.

ఉదయం 7 గంటలకే వెళ్లండి

ఎన్నికల రోజున రాష్ట్ర ప్రజలంతా ఉదయం ఏడింటికే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా ఓటేయాలని కోరారు. ‘వైకాపా నాయకులు మారీచులు. మారువేషంలో వస్తారు. మిమ్మల్ని మభ్యపెడతారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది. విజయం మనదే. ఇటీవల ఉద్యోగులు, పోలీసులు పోస్టల్‌ బ్యాలట్‌లో ఓటేశారు. వైకాపా వాళ్లు డబ్బులిచ్చినా మనకే మద్దతు తెలిపారు. అప్పుడే అయిపోలేదు. మీ కుటుంబసభ్యులనూ అప్రమత్తం చేయండి. ఈ నెల 13న కూటమికే ఓట్లేయించండి’ అని కోరారు.

ఈ జన సునామీలో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తుడిచిపెట్టుకుపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్రను తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు బొత్స సత్యనారాయణ అని, చీపురుపల్లిలో ఆయన చిత్తుగా ఓడిపోతారని చెప్పారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.


రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు చంపాలని కుట్ర

‘రాజమహేంద్రవరం జైల్లో నన్ను చంపాలని చూశారు. డ్రోన్లు పంపి అనేక విధాలుగా ప్రణాళిక చేసినా ఎక్కడా జంకలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘విలాసమైన ప్యాలెస్‌లలో ఉండేందుకు అలవాటుపడిన వ్యక్తి జగన్‌. హైదరాబాద్‌, బెంగళూరు, ఇడుపులపాయ, తాడేపల్లి ప్యాలెస్‌తోపాటు ఇప్పుడు రుషికొండను బోడిగుండు చేసి ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. దానికి రూ.500 కోట్లు వెచ్చించారు. టూరిజం రిసార్టు అన్నారు. ఇప్పుడు అందులో ఎవరైనా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలట. అంతపెట్టి ఎవరైనా ఉంటారా? రుషికొండను అనకొండలా కొట్టేశారు’ అని విమర్శించారు. జగన్‌, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి విశాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తులను కొట్టేశారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ తిరిగి ప్రజలకే పంచిపెడతానని చంద్రబాబు పేర్కొన్నారు.


నేడు అయిదు ప్రజాగళం సభలకు చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ప్రచారంలో తెదేపా అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. మార్చి 27న ‘ప్రజాగళం’ పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభించిన ఆయన ఇప్పటి వరకు 82 సభలు నిర్వహించారు. ప్రచారానికి శనివారం సాయంత్రంతో తెరపడనుండడంతో ఆయన మరింత దూకుడు పెంచారు. శుక్రవారం ఒక్క రోజే ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభల్లో ప్రసంగిస్తారు. శనివారం మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రచార గడువు ముగిసే నాటికి మొత్తం 90 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన పూర్తికానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img