icon icon icon
icon icon icon

Pawan Kalyan: జగన్‌ను గద్దె దించే వరకు యువత పోరాడాలి: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైనా సీఎం జగన్‌ ఒక్కసారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 

Published : 27 Apr 2024 20:24 IST

కాకినాడ: రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైనా సీఎం జగన్‌ ఒక్క సారి కూడా స్పందించలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా గంజాయి దొరుకుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి విక్రయించే వాళ్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం. ద్వారంపూడి, కన్నబాబుకు నరకం అంటే ఏంటో చూపిస్తాం. వారి అంతు తేల్చేందుకే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. జగన్‌ సీఎంలా కాకుండా ..సారా వ్యాపారిలా మాట్లాడుతున్నారు.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు అవినీతి పరాకాష్ఠకు చేరింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు లే అవుట్‌ వేస్తే కన్నబాబుకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే.  వీళ్ల వేధింపులు తట్టుకోలేక ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువత రౌడీయిజానికి భయపడితే ఎక్కడికి పారిపోతారు. మీలో ధైర్యం కల్పించేందుకే ఇక్కడికి వచ్చా. జగన్‌ను గద్దె దించే వరకు యువత పోరాడాలి. ఐదేళ్లలో రూ.70కోట్లు ట్యాక్స్‌ కట్టానంటే ఎంత సంపాదించగలనో అర్థం చేసుకోండి. ఇంత డబ్బు సంపాదించి కూడా నేను ఎందుకు రోడ్లపై తిరుగుతున్నానంటే ఈ నేలకోసం కష్టపడే కొంత మంది వ్యక్తుల సమూహం కావాలి. 30 వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే ముఖ్యమంత్రి ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు బాధేస్తోంది. కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు దగ్ధమవుతున్నాయి. కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేసి బోటులో గంజాయి ఉందని గుర్తిస్తే చాలు.. స్మగ్లర్లు దాన్ని తగలబెట్టేసి వెళ్లిపోతున్నారు. 16, 17 ఏళ్ల యువత కూడా గంజాయికి బానిసలవుతున్నారు. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేస్తేనే సమాజం బాగుపడుతుంది’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img