icon icon icon
icon icon icon

జగనన్న ఇచ్చే డబ్బులు నా కోసమే

ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటర్లకు పంచే డబ్బులు తన కోసమేనని కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Published : 09 May 2024 07:12 IST

ఆడబిడ్డ ఇంటికి వచ్చి అడిగితే కాదనలేరు కదా..
షర్మిల ఎద్దేవా

చక్రాయపేట, వేంపల్లె, వేముల, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో సీఎం జగన్‌ ఓటర్లకు పంచే డబ్బులు తన కోసమేనని కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం వేంపల్లెలో బుధవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆమె ఓటర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం జగన్‌ ఎంత డబ్బులు ఇస్తున్నారని అడిగారు. ఓటుకు రూ.2 వేలు ఇస్తున్నారని ప్రజలు చెప్పారు. దీనిపై షర్మిల స్పందిస్తూ.. ‘సీఎం జగన్‌ నా సోదరుడు. ఆయన ఇచ్చేదంతా చెల్లెలి కోసమే. రాయలసీమలో చెల్లెళ్లను ఎలా చూసుకుంటారో అందరికీ తెలుసు. ఆడబిడ్డ ఇంటికి వచ్చి నోరు తెరిచి అడిగితే ఏ అన్న అయినా కాదంటాడా’ అని వ్యంగ్యంగా అన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ఏ రోజూ జిల్లా ప్రజల కోసం పని చేయలేదని, సొంత నియోజకవర్గంలో జగన్‌ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు. చిన్నాన్న వివేకా ఆత్మ కడప గడ్డమీద న్యాయం కోసం ఘోషిస్తోందన్నారు. ప్రజా కోర్టులో న్యాయం కోసం వచ్చాం.. మీ ఆడబిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం.. న్యాయం చేయండని ఓటర్లను కోరారు. వివేకా కుమార్తె సునీత మాట్లాడుతూ.. సీఎం జగన్‌ సతీమణి భారతి పులివెందుల నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు తప్ప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి ఓటు వేయమని అడగలేదన్నారు. ఆయన పేరు చెబితే ఎక్కడ మీరు ప్రశ్నిస్తారోనని అడగడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో షర్మిలకు ఓట్లు వేసి న్యాయాన్ని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ పులివెందుల అభ్యర్థి ధ్రువకుమార్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img