icon icon icon
icon icon icon

ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి

ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు.

Updated : 09 May 2024 07:50 IST

‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల లేఖ
రాజధాని రైతుల గోడు పట్టని  ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే!

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. ‘రాజధాని విషయంలో మాట తప్పానని మీకు అనిపిస్తే నాకు ఓటేయకండి’ అని రాష్ట్ర ప్రజలను అడిగే ధైర్యం మీకుందా అని జగన్‌కు సవాల్‌ విసిరారు. ‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు తొమ్మిది ప్రశ్నలు సంధిస్తూ బుధవారం మరో లేఖ రాశారు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఏపీ.. ఇప్పుడు రాజధాని లేక అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. మీ రాజధాని ఏదనే ప్రశ్నకు రాష్ట్ర ప్రజలను ఏం సమాధానం చెప్పాలో తెలియని అయోమయ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, సంక్షేమం మీద జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల తరఫున తాను అడిగే సందేహాలను నివృత్తి చేయాలని డిమాండు చేశారు.

షర్మిల సంధించిన ప్రశ్నలు

1 ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి.
2 రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని ప్రతిపక్షనేతగా అంగీకరించిన మీరు.. అధికారంలోకి వచ్చాక సీఎంగా అమరావతిపై ఎందుకంత కక్ష కట్టారు?
3 అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని మారుస్తారట కదా అని 2019 ఎన్నికలకు ముందు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. ‘చంద్రబాబుకు అక్కడ ఇల్లయినా లేదు.. నేను అక్కడే ఇల్లు కట్టుకుంటున్నా’ అని ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చెప్పింది నిజం కాదా?
4  అమరావతిలోనే ఉండాలని, రాజధాని మరెక్కడికీ తరలించవద్దని ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిన తరవాత కూడా మార్చాలని, మూడు రాజధానులుగా విడగొట్టాలనే పట్టుదల ఎందుకు?
5 అమరావతే రాజధానిగా ఉండాలని.. మార్చొద్దని ఇతర పార్టీలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలూ చెబుతున్నా.. ఆ వాదన వీగిపోయేలా చేయాలనే మీ పట్టుదల, సహాయ నిరాకరణ వల్లే అమరావతికి మెట్రో రైలు, బాహ్య వలయ రహదారి, కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన, రాజధానిని కలుపుతూ విజయవాడ-గుంటూరు రైల్వేలైన్‌.. లాంటివి ఎన్నో రాకుండా పోయాయి అనేది నిజం కాదా?
6 రాజధాని కోసం భూములిచ్చిన రైతులు నాలుగున్నరేళ్లుగా ఉద్యమం చేస్తుంటే.. వారితో చర్చలు జరిపి, వాళ్ల బాధలేంటో తెలుసుకునే కనీస బాధ్యత ప్రజలచేత ఎన్నికైన ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉండదా?
7 దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 29 వేల మంది రైతులు సుమారు 34వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. అలాంటి వారికి ఏ విధంగానైనా.. ప్రయోజనం చూపించాల్సిన బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాన్ని గద్దె దింపొద్దంటారా?
8 ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పిన తరవాత కూడా ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష’ సాకుతో అడ్డదారిన తరలింపు జరుపుతున్నది నిజం కాదా?
9 ‘రాజధాని విషయంలో 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట నేను తప్పానని భావిస్తే నాకు ఓటు వేయకండి’ అని రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img