icon icon icon
icon icon icon

బీసీల హత్యలపై ఒక్కరోజైనా మాట్లాడారా?

సీఎం జగన్‌ ఐదేళ్ల పాలన... వెనకబడిన తరగతుల ఉనికిని దెబ్బతీసేలా సాగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ధ్వజమెత్తారు.

Published : 09 May 2024 07:22 IST

రాజకీయంగా బీసీలు ఎదగకుండా రిజర్వేషన్లలో కోత
కులగణన వివరాలు ఏవీ?
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ ఐదేళ్ల పాలన... వెనకబడిన తరగతుల ఉనికిని దెబ్బతీసేలా సాగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, సంక్షేమం ఇలా అన్నింటిలోనూ ఆయన చేసింది దగానే అని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలపై దాడులు పెచ్చుమీరినా, హత్యలు, అరాచకాలు జరిగినా ఏనాడూ కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. బీసీలవి ప్రాణాలు కాదా? అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై శంకరరావు ‘ఈనాడు’తో మాట్లాడారు.

సామాజిక న్యాయమంటే ఇదేనా?

మాటెత్తితే చాలు సామాజిక న్యాయం చేశామంటూ జగన్‌ మాట్లాడతారు. జనాభా దామాషా ప్రకారం ఎప్పుడైనా ఏ రంగంలోనైనా బీసీలకు న్యాయమైన వాటా కల్పించారా? విశ్వవిద్యాలయాల వీసీ పోస్టుల్లో ఎంతమంది బీసీల్ని నియమించారు? తితిదే ఛైర్మన్‌ పోస్టులో యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతను గత ప్రభుత్వం నియమించింది. ఈ ఐదేళ్లలో ఛైర్మన్‌గా ఎందుకు బీసీలను నియమించలేదు. సలహాదారు పదవుల్లో ఎంతమంది బీసీలున్నారు?

ఇంతకంటే దారుణాలు ఉంటాయా?

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని వైకాపా నేతల్ని ప్రశ్నించినందుకు అమర్నాథ్‌గౌడ్‌ అనే పదోతరగతి విద్యార్థిని పెట్రోలు పోసి తగలబెట్టారు. చంద్రయ్యను కిరాతకంగా హత్య చేశారు. ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. జగన్‌ వీటిపై స్పందించలేదు. బాధితుల్ని పరామర్శించలేదు. బీసీలవి ప్రాణాలు కాదా? అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థలు కీలకం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌... బీసీలకు 10 శాతం రిజర్వేషన్లపై కోత వేశారు. ఫలితంగా 16,000 రాజకీయ పదవులు దక్కలేదు.

ఇది మోసం చేయడమే...

బీసీ కులగణన అనేది ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్‌. జనాభా దామాషా ప్రకారం నిధులు దక్కక బీసీలు నష్టపోతూనే ఉన్నారు. దీన్ని కూడా జగన్‌ ఎన్నికల ప్రచార అస్త్రంగా చూశారు. బీసీలను ఉద్ధరించేందుకు కులగణన చేస్తామని ఊదరగొట్టారు. శాస్త్రీయత లేకుండా ఏదో వివరాలు సేకరించి కిమ్మనకుండా ఉన్నారు. ఇది బీసీలను మోసం చేయడం కాదా?

భవన నిర్మాణంపై కోలుకోలేని దెబ్బకొట్టారు

రాష్ట్ర ఉత్పాదకతలో భవన నిర్మాణ రంగం కీలకమైనది. దీనిపై ఆధారపడ్డ వారందరూ దాదాపు బీసీలే. జగన్‌ అధికారంలోకి రాగానే ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారు. ఇసుకను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి కార్మికులను రోడ్డున పడేశారు. కులవృత్తుల్ని దెబ్బతీశారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి అత్యాధునిక పరికరాలు అందకుండా చేశారు. గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఉపప్రణాళిక కింద ఏటా బడ్జెట్‌ను పెద్ద ఎత్తున కేటాయించినట్లు చూపించారు గానీ... ఆ నిధుల్ని వారి అభివృద్ధికి వినియోగించింది లేదు. బీసీలకోసం కేటాయించాల్సిన రూ.75 వేల కోట్లను మళ్లించారు. అందరికీ వర్తింపచేసే పథకాలనే ఇస్తూ మోసగించారు. బీసీల అభ్యున్నతికి 56 ఉత్తుత్తి కార్పొరేషన్లు తెచ్చినట్లు ప్రచారం చేసుకున్నారే తప్పితే వాటికి ఒక్క రూపాయీ కేటాయించలేదు. చిన్నచిన్న పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం బీసీలకు అందించిన స్వయం ఉపాధి రాయితీ రుణాల్ని ఆపేశారు. నాయిబ్రాహ్మణులు, రజకులు, గీత కార్మికులు, యాదవులు ఇలా అన్ని వెనకబడిన తరగతుల వారినీ వెన్నుపోటు పొడిచారు. స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేశారు. బీసీ భవనాల ఏర్పాటును అటకెక్కించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img